సోషల్ మీడియా వచ్చాక ఇదంతా టైం వేస్ట్ యవ్వారం అనుకునే మాటలో నిజం లేకపోలేదు కానీ కొన్నిసార్లు ఒక్కో విషయం మీద జరిగే చర్చలు లోతుగా ఆలోచించేలా చేస్తాయి. నిన్న ఒక పేరు మోసిన ఓటిటి అప్డేట్స్ ఇచ్చే హ్యాండిల్ మహేష్ బాబు ఒక్కడు కంటే దాని తమిళ రీమేక్ విజయ్ గిల్లినే చాలా బాగుంటుందని కితాబిస్తూ ఒక ట్వీట్ చేసింది. దీంతో ఇది కాస్తా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య హాట్ డిబేట్ కి, ఆర్గుమెంట్లకి దారి తీసింది. వ్యవహారం పరస్పరం ట్రోలింగ్ దాకా వెళ్లిపోయింది. నిజానికి ఒక్కడు ఎన్ని భాషల్లో పునఃనిర్మాణం జరుపుకున్నా ఛార్మినార్, కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్ లో గుణశేఖర్ తీసిన దాని ముందు మిగిలినవి దిగదుడుపే.
కేవలం అటెన్షన్ కోసం ఇలాంటి డిస్కషన్లకు తెరతీస్తారు కానీ ఇంకో కోణంలో చూస్తే ఆసక్తికరమైన విశ్లేషణ బయటపడుతుంది. నిజమే ఒరిజినల్ ని ఎన్ని కాపీలు తీసినా అసలులో ఉన్న ఆత్మని మించేలా తీయడం కష్టం. కానీ దీన్ని బ్రేక్ చేసిన వాళ్ళు లేకపోలేదు. దారుణంగా మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దబాంగ్ కన్నా గబ్బర్ సింగ్ చాలా మెరుగ్గా కనిపించే మాట వాస్తవం. పెదరాయుడులో రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు దీని మాతృక తమిళ నాట్టమైలో విజయ్ కుమార్ తేలిపోతాడు. చినతంబిలో ప్రభు కంటే చంటిలో వెంకటేష్ నటన ఓ రెండు మెట్లు పైనే ఉంటుంది. కార్తీక్, రోజా జంట కన్నా రాజాలో వెంకటేష్, సౌందర్యలు బెస్ట్ అనిపిస్తారు.
మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, ఘరానా మొగుడు, హిట్లర్, నువ్వు వస్తావని, ఖుషి ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఇవన్నీ రీమేకులే అయినా ఇండస్ట్రీ రికార్డులు సాధించినవి. ఇంకోవైపు చూద్దాం. షోలేని రామ్ గోపాల్ వర్మ ఆగ్ పేరుతో మళ్ళీ తీస్తే జనం మార్నింగ్ షో సగం కాకుండానే థియేటర్ నుంచి బయటికి పరుగులు పెట్టారు. హిందీలో చరిత్ర సృష్టించిన జంజీర్, రోటి కపడా మకాన్, ముకద్దర్ కా సికందర్, డాన్ వగైరాలు తెలుగులో ఆ స్థాయి మేజిక్ చేయలేకపోయాయి. హిట్టయ్యాయి కానీ పోలికల పరంగా చూసుకుంటే వెనుకబడినట్టే అనిపిస్తాయి.
మొన్నటికి మొన్న వచ్చిన బుట్టబొమ్మ మలయాళంలో ఆహా అని మెప్పులు పొందితే ఇక్కడ వామ్మో అనిపించింది. వంద కోట్లు సాధించిన లూసిఫర్ ని చిరంజీవి లాంటి మెగాస్టార్ చేసినా యావరేజే అయ్యింది. భీమ్లా నాయక్ సైతం తొంబై కోట్ల లోపే ఆగిపోయింది. ఇది ఎప్పటికి ఎడతెగని చర్చ. ఎందుకంటే వంద సంవత్సరాలకు దగ్గరగా వెళ్తున్న ఇండియన్ సినిమాలో రీమేకుల పర్వం ఇప్పటిది కాదు. ఇకపై ఆగేది కాదు. కాకపోతే టెక్నాలజీ విపరీతంగా పెరగడం వల్ల ఆడియన్స్ కి వరల్డ్ కంటెంట్ అరచేతిలోకి వచ్చాక దర్శకులు రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అంతే సంగతులు.



