సోషల్ మీడియా: మనిషి పైశాచికానందానికి వేదిక?

Concept image showing social media harassment and trolling faced by celebrities like Rashmika Mandanna and Anasuya on digital platforms.

మనిషి సృష్టించిన ఆయుధాలు మనుషులనే చంపుతున్నట్లు సోషల్ మీడియా కూడా మనుషుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. సెలబ్రెటీలు మొదలు సామాన్య ప్రజల వరకు ప్రతీ ఒక్కరి జీవితంలోకి సోషల్ మీడియా జొరబడుతోంది.

సోషల్ మీడియాతో పాపులర్ అవ్వాలనుకునేవారు కొందరైతే, అలా సులువుగా పాపులర్ అవ్వడానికి సెలబ్రెటీల గురించి నిత్యం ఏదో ఒకటి వ్రాసేస్తూ, కుదిరితే వీడియో క్లిప్పింగ్స్ కూడా జోడించేస్తున్నారు మరికొందరు.

ADVERTISEMENT

అవి సంబందిత వ్యక్తుల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?ఎటువంటి సమస్యలు తెచ్చిపెడతాయి? వారి కుటుంబాలలో చిచ్చు రగిలితే వారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచించాల్సి ఉండగా, ఈ సెన్సేషన్ పోస్టు, కామెంట్స్‌తో నాకు ఎన్ని లైక్స్, వ్యూస్, పాపులారిటీ, ఆదాయం వస్తుందని మాత్రమే ఆలోచిస్తున్నారు.

చాలా మంది మనుషులలో ఎంతో కొంత రాక్షసత్వం, పైశాచికత్వం ఉంటుంది. అది సమయం సందర్భం బట్టి బయటపడుతుంటుంది. కానీ సోషల్ మీడియా అనే వేదికలో ఎలాంటి పరిమితులు లేవు. ఎలాంటి సంకోచాలు అవసరం లేదు. పైగా జవాబుదారీ కానవసరం లేదు.

మన ఉనికి బయటపెట్టకుండా మారు పేర్లు, నకిలీ అకౌంట్లతో ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా… ఎవరిని పడితే వారిని నోటికొచ్చినట్లు మాట్లాడవచ్చు. తిట్టవచ్చు. దుష్ప్రచారం చేయవచ్చు. కనుక మనిషిలో రాక్షసత్వం బయట పెట్టుకుని పైశాచికానందం అనుభవించేందుకు సోషల్ మీడియా ఓ చక్కటి వేదికగా లభించిందనే చెప్పాలి.

కనుక దానిలోకి కాలకేయులు జొరబడి సమాజంపై తమ ప్రతాపం చూపుతున్నారు. అదే సమాజంలో తాము ఉన్నామనే సంగతి మరిచి కొందరు హద్దులు దాటి ఇబ్బందులలో పడినప్పుడు, దేశాల సరిహద్దులు దాటి ఎక్కడికో పారిపోయి దాక్కుంటున్నారు.

కానీ రాష్ట్రాలకు, దేశాలకు సరిహద్దులు ఉంటాయి కానీ సోషల్ మీడియాకు ఉండవుకదా? కనుక ఎవరూ ఎవరి నుంచి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది.

తాజాగా రష్మిక మందన కూడా అలాంటి కాలకేయులతో తాను గత 8 ఏళ్ళుగా వేధింపులు భరిస్తూనే ఉన్నాననే విషయం బయటపెట్టారు. ఒక్క చేత్తో చప్పట్లు మోగవు. ఇంతకాలం ఆమె స్పందించలేదు కనుక చప్పుడవలేదు.

కానీ కాలకేయుల వేధింపులు భరించలేక ఎదురు తిరిగే నటి అనసూయ వంటివారు సోషల్ మీడియాలో కనపడని అదృశ్య శక్తులతో నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఒక మహిళ… అందునా ఇద్దరు పిల్లల తల్లి… ఈవిధంగా స్పందిస్తుండటంతో చాలా మందికి ఇగో దెబ్బ తింటోంది. కనుక ఆమెపై మరింత అనుచితంగా కామెంట్స్ జేస్తున్నారు.

ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు. కానీ ఆమె విషయంలో కొందరు రాక్షసత్వం, పైశాచికత్వం బయటపెట్టుకుంటున్నారు కదా? ఏదైనా గుప్పిట మూసి ఉన్నంతవరకే… హద్దులు దాటనంతవరకే! దాటితే సమస్యలు తప్పవు.

సృజనాత్మకత ఉంటే దానిని జీవితంలో రాణించేందుకు ఉపయోగించుకోవాలి. అంతే కానీ సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే తిరిగి ఏదో రోజూ మూల్యం చెల్లించుకోక తప్పదు… అని కాస్త ఆలస్యంగానైనా తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories