తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక గెలవడంతో బీజేపీలో జోష్ నిండిపోయింది. తెలంగాణ బీజేపీ కంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ మరింత ఉత్సాహంగా ఉండటం గమనార్హం. దుబ్బాకలో వాళ్లే గెలిచినంత ఆనందంలో ఉన్నారు ఏపీ బీజేపీ నాయకులు. అదే స్పూర్తితో తిరుపతికి జరిగే ఉపఎన్నికలో తాము గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నటున్నారు.
తాజాగా… “తిరుపతి లోకసభ ఉపఎన్నిక బీజేపీ-జనసేన కి మద్దతు ఇచ్చి మా అభ్యర్థి ని గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు ప్రాజెక్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. వైకాపా అభ్యర్థి గెలిపిస్తే ఏమి రాదు. ఉన్న 23మంది ఎంపీలను ఏమి చేసుకోవాలో ముఖ్యమంత్రి కి తెలియదు,” అంటూ చెప్పుకొచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.
అయితే ‘దేశం మొదట.. పార్టీ తరువాత.. చివరిగా నేను’ అని చెప్పుకునే పార్టీ తమను గెలిపిస్తేనే కేంద్రం నుండి మరిన్ని నిధులు ప్రాజెక్ట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం గా అందరికీ న్యాయం చేస్తారా లేక మాకు ఓట్లు వేసినవారికే నిధులు ప్రాజెక్టులు అంటారా అని వారు ఎద్దేవా చేస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు అకాల మరణం కారణంగా తిరుపతి లోక సభకు ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఇప్పటికే అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం తమ అభ్యర్థులను ప్రకటించాయి. దివంగత ఎంపీ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడం గమనార్హం. 1999లో ఈ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో బీజేపీ ఒకసారి గెలిచింది.





