అది బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ ఉమ్మడి వ్యూహమా?

Somu Veerraju - Vijaya Sai Reddyఎలాగైనా పవన్ కళ్యాణ్ ను తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి రప్పించడానికి బీజేపీ నానా తిప్పలు పడుతుంది. ప్రధాని మోదీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ ని ఎంతో గౌరవిస్తారని, పార్టీ నాయకులు అందరూ అదే గౌరవాన్ని చూపాలంటూ వీర్రాజు తాజాగా తమ పార్టీ వారికి సూచించారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలని తమ పార్టీ అనుకుంటుందని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

పవన్ ని ప్రసన్నం చేసుకోవడానికి వీర్రాజు ఇలా తిప్పలు పడుతుంటే… ఇందులోకి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి దిగారు. “తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు,” అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

ఇందుకు ఏ మాత్రం తగ్గకుండా, “మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి,” అంటూ అంతే ఘాటుగా సమాధానం చెప్పారు.

సహజంగా తిరుపతిలో 2019 ఎన్నికలలో ఆరవ స్థానంలో నిలిచిన బీజేపీ పై వైఎస్సార్ కాంగ్రెస్ అసలు స్పందించనవసరం లేదు. అయితే బీజేపీని విమర్శించి ఆ తరువాత విమర్శింపచేసుకుని టీవీ ఛానళ్లకు మేత వేసే వ్యూహంగా కనిపిస్తుంది. ఆ రకంగా బీజేపీని లేపి ఏదో రకంగా రెండవ స్థానంలోకి తెచ్చి టీడీపీని దెబ్బకొట్టే వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహమో లేక ఇరు పక్షాల ఉమ్మడి వ్యూహమో!

ADVERTISEMENT
Latest Stories