శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్ లో సంచలన విజయం నమోదైంది. బంగ్లాదేశ్ ముందుంచిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని అవలీలగా చేధించి ‘టైగర్స్’ అన్న పేరును సార్ధకం చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసి 214 పరుగుల భారీ స్కోర్ ను చేసిన తర్వాత ఎవరైనా శ్రీలంక విజయాన్ని ఖరారు చేసుకుంటారు. అది కూడా ప్రత్యర్ధి బంగ్లా కావడంతో, మరో ఆలోచనకు తావివ్వరు. కానీ అలాంటి వాటిని పటాపంచలు చేస్తూ… అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
అంత భారీ లక్ష్యాన్ని ఓపెనర్ లిటన్ దాస్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో అదిరిపోయే రేంజ్ లో ఆరంభించాడు. మరో ఓపెనర్ తమీం ఇక్బాల్ 29 బంతుల్లో 47 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చి ఓపెనర్లు వెనుతిరిగినప్పటికీ, కీపర్ ముష్ ఫికుర్ రహీమ్ రన్ రేట్ ను ఎప్పుడూ అదుపులో ఉంచుతూ చూడముచ్చని షాట్లతో మ్యాచ్ ను బంగ్లాదేశ్ వైపుకు తిప్పి శ్రీలంకకు కోలుకొని షాక్ ఇచ్చాడు. తాను ఫేస్ చేసిన మూడవ బంతినే రివర్స్ స్వీప్ తో ప్రారంభించి, 19.4 ఓవర్స్ వద్ద మ్యాచ్ ను ముగించాడు.
మ్యాచ్ ను గెలిపించిన ఆనందంలో రహీమ్ చేసిన సెలబ్రేషన్స్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సింగల్ పరుగు తీసి గట్టిన అరిచిన రహీం గ్రౌండ్ లో కోబ్రా డ్యాన్స్ వేసి మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న వీక్షకులను ఆనందింపజేశాడు. ఇంత చేస్తే నెటిజన్లు మామూలుగా ఊరుకుంటారా… సదరు కోబ్రా డ్యాన్స్ పిక్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తొలిసారి ఇలాంటి డ్యాన్స్ లు క్రికెట్ మైదానంలో ప్రదర్శించడంతో… మున్ముందు ఇదొక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందేమో..!



