ఇటీవల శ్రీరెడ్డి అనే వర్ధమాన నటి టాలీవుడ్ లో లేవనెత్తిన ‘కమిట్మెంట్’ ఎంత పెనుదుమారం రేపిందో తెలియనిది కాదు. ఇండస్ట్రీలో ‘కమిట్మెంట్’ అన్న పదం ఉందని సినీ పెద్దలు కూడా అంగీకరించడంతో అసలు నిజం వెలుగుచూసింది. ఈ నేపధ్యంలోనే… ఓ మీడియా ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చాన్ ఖాన్ అనే కో- ఆర్డినేటర్ పేరును బయట పెట్టారు. ముంబైకు చెందిన ఈ కో-ఆర్డినేటర్ టాలీవుడ్ లో అందరికీ సుపరిచితమేనని శ్రీరెడ్డి స్పష్టం చేసింది.
చాన్ ఖాన్ వాట్సప్ సందేశాలు మరియు వాయిస్ రికార్డులను బయటపెట్టిన ఈ స్టింగ్ ఆపరేషన్ బడా బాబుల పేర్లు కూడా ఉన్నాయని, అయితే వారి పేర్లు బయట పెడితే తమ బ్రతుకులు నాశనం అవుతాయన్న విక్టిమ్స్ వ్యధతో తాము బయట పెట్టడం లేదని సదరు మీడియా పేర్కొంది. అయితే ఇందులో ప్రముఖంగా ఓ అగ్ర దర్శకుడు, ప్రముఖ నిర్మాత తనయుడు ఉన్నాడని కొన్ని హింట్స్ ఇచ్చారు. బాధితుల సెక్యూరిటీ కారణాలతో చెప్పడం లేదని అన్న సదరు మీడియా ఛానల్ వారి గురించి చెప్పిన సంగతులేమిటంటే…
ఇటీవలే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ అగ్ర దర్శకుడు సందేశాత్మక సినిమాలు తీస్తారని, గ్రామాలను, దేశాలను బాగుచేయాలని చెప్తారని, రచయిత నుండి దర్శకుడిగా ఎదిగారని… ఇంతలా ఎదిగిన ఈ దర్శకుడు సినీ అవకాశాల కోసం అమ్మాయిలను న్యూడ్ ఫోటోలను పంపాలని కోరుతున్నారని, అలాగే న్యూడ్ ఛాటింగ్ చేయాల్సిందిగా అడుగుతారని కధనాలను ప్రసారం చేసింది. ఈ హింట్స్ తో ఊహించుకుంటున్న ఆ అగ్ర దర్శకుడి తీరుకు – వీరి కధనాలకు ఎక్కడ పొంతనే లేదని వాపోవడం ప్రేక్షకుల వంతవుతోంది.
ఇలా ఒకరిద్దరు కాదు, ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇలాంటి వారే ఉన్నారని, ఇందుకు తగిన విధంగా ‘మా’ స్పందించాలని కోరారు. ‘తాను నోరు విప్పి ఒక్కొక్కరి పేర్లు బయట పెడితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుందని, అంత కోపం తనకు వస్తోందని, సినీ అవకాశాల కోసం తాను కూడా ఓ నిర్మాత కొడుకు వలలో చిక్కుకున్నానని, ఆయన వలన నాకు ఒక్క సినిమా కూడా రాలేదని’ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. అయితే ఇలా పేర్లు చెప్పకుండా ప్రసారం చేస్తే ఉపయోగం ఉండదని, వారి పేర్లు బయట పెట్టాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ డిమాండ్ చేసినప్పటికీ, అధికారికంగా పేర్లు మాత్రం వెల్లడి కాలేదు.



