‘బాహుబలి’ అంతటి విజయం తెలుగు సినిమా సృష్టిస్తుందని ఎపుడైనా అనుకున్నామా? కానీ రాజమౌళి దాన్ని చేసి చూపించాడు. అలాగే ఇద్దరు అగ్ర హీరోలతో భారీ మల్టీస్టారర్ కార్యరూపం సిద్ధించుకుంటుందని తెలుగు ప్రేక్షకులు అంచనాలు వేసారా? ఊహలకే పరిమితం అయిన ఈ ఆలోచనలను కూడా జక్కన్న ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మొదలుపెట్టాడు. అవును… మల్టీస్టారర్ సినిమా అనగానే ముందుగా అభిమానుల మధ్య యుద్ధమే జరుగుతుందన్న భావన కలుగుతుంది.
కానీ రాజమౌళి దీనిని చూడముచ్చటగా సెట్ చేయబోతున్నారని ఫస్ట్ ఇంప్రెషన్ లోనే చెప్పేసాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసిన వీడియోలో “ఆర్ఆర్ఆర్” అంటూ ప్రజెంట్ చేసిన వాటిల్లో… ఒకటి రాజమౌళి కాగా, మరొకటి రామ్ చరణ్, ఇక చివరగా జూనియర్ ఎన్టీఆర్ లోని ‘జూనియర్ ఎన్టీ’ని తొలగించి ‘ఆర్’ అంటే రామారావు అర్ధం వచ్చే విధంగా సెట్ చేసి ఈ ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేసారు. అంటే ఈ సినిమా నుండి జూనియర్ ఎన్టీఆర్ కాస్త రామారావుగా మారిపోతాడేమో చూడాలి.
ఇలా ‘ఆర్ఆర్ఆర్’ నుండే రాజమౌళి సెట్ చేసాడంటే… సినిమాను ఏ స్థాయిలో బ్యాలెన్స్ చేస్తూ దించుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఒకే తరానికి చెందిన ఇద్దరు అగ్ర హీరోలతో మల్టీస్టారర్ సినిమా చూడాలన్నా కోరిక అయితే తెలుగు ప్రేక్షకులకు త్వరలో తీరబోతోందన్న మాట. ఇది ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కే కాదు, తెలుగు సినీ అభిమానులకు కూడా పండగ లాంటి వార్త. రాజమౌళి మాట ఇచ్చిన విధంగానే ఈ సినిమాను డివివి దానయ్యకు చేయబోతున్నాడని ఈ సందర్భంగా ఖరారయ్యింది.



