తమిళనాడు సిఎంగా విజయ్ దళపతి బాధ్యత చేపట్టి పదిరోజులు కూడా కాలేదు. కానీ విజయ్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునని కనుక తదనంతర పరిణామాలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మాజీ సిఎం స్టాలిన్ నేడు పిలుపునిచ్చారు.
ఆరు నెలలు విజయ్ ప్రభుత్వం జోలికి వెళ్ళనని, ఎటువంటి అపకారం, విమర్శ చేయనని తనంతట తానే చెప్పిన స్టాలిన్ అప్పుడే ఈవిధంగా మాట్లాడుతున్నారు.. ఎందుకు? అంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 12 మంది ఎమ్మెల్యే డీఎంకే మిత్రపక్షాలే. నేటికీ అవన్నీ డీఎంకేతోనే ఉన్నాయి. కనుక స్టాలిన్ కనుసైగ చేస్తే చాలు అవి మద్దతు ఉపసంహరించుకుంటాయి.
కానీ విజయ్ ప్రభుత్వానికి అన్నాడీఎంకే పార్టీలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు. కనుక డీఎంకే మిత్రపక్షాలకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నా విజయ్ ప్రభుత్వానికి ఢోకా ఉండదు.
మరి స్టాలిన్ అలా ఎందుకున్నారు? అని ఆలోచిస్తే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న 25 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అన్నాడీఎంకే న్యాయపోరాటానికి సిద్దమవుతున్నందున కావచ్చు. లేదా మరో బలమైన కారణం చేత వారు కూడా తప్పుకునే అవకాశం ఉంది కనుక విజయ్ ప్రభుత్వం కూలిపోతుందని స్టాలిన్ అనుకుంటున్నారేమో?
ఏ కారణం చేత విజయ్ ప్రభుత్వం కూలిపోయినా తమిళనాడు రాజకీయాలు మళ్ళీ మొదటికొస్తాయి. ముఖ్యంగా బిజేపి స్నేహ హస్తం అందుకోనందుకు విజయ్ తాపీగా పశ్చాతాపపడాల్సి వస్తుంది.




