2013లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం ద్వారా ప్రామిసింగ్ యాక్టర్ గా మారిన సందీప్ కిషన్, ఆ తర్వాత అభినయం పరంగా అలరించినా, సక్సెస్ కు మాత్రం దూరమయ్యాడు. వరుసగా ‘గుండెల్లో గోదారి, డి ఫర్ దోపిడీ, రారా కృష్ణయ్య, జోరు, బీరువా, టైగర్, రన్, ఒక అమ్మాయి తప్ప’ సినిమాలు వచ్చినట్టే వచ్చి చతికిల పడుతున్నా… ప్రతి సినిమాకు విజయం కోసం పరితపిస్తూ కనిపిస్తున్నాడు సందీప్ కిషన్.
ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత రాబోతున్న ‘మాయవన్’ సినిమా టీజర్ మాత్రం, ఈ సారి సందీప్ సక్సెస్ ఇస్తుందన్న నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించింది. తాజాగా తమిళంలో విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఒక కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషనే ఈ సినిమా కధగా కనపడుతోంది. హీరోహీరోయిన్లైన సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉండగా, ఉత్కంఠభరితంగా సాగిన జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, సివి కుమార్ టేకింగ్, టీజర్ కటింగ్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.



