ఇండస్ట్రీలో తిరుగులేని టాప్ కమెడియన్ గా వెలుగొందుతున్న తరుణంలో… హీరో అంటూ కామెడీ రోల్స్ వదిలేసిన సునీల్ కు తొలుత కొన్ని హిట్స్ పలకరించినా, ఆ తర్వాత విజయం మాట పక్కన పెడితే, ప్రేక్షకులలో సునీల్ కున్న మంచి ఫేం కూడా ఫేడవుట్ అయిపోయే స్థాయికి చేరుకున్నాడు. గత రెండు సంవత్సరాల నుండి అయితే సునీల్ సినిమా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్తుందో ‘రివ్యూ’లు రాసే వారికి తప్ప ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.
దీంతో గత సినిమా విడుదల సందర్భంలో… తాను మళ్ళీ కమెడియన్ గా నటించడానికి సిద్ధమంటూ చేసిన ప్రకటనకు ఫలితాలు వచ్చేలా కనపడుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో సునీల్ కమెడియన్ గా చేయబోతున్నారని వార్తలు వస్తుండగా, తాజాగా మరో కీలక సమాచారం బయటకు వచ్చింది. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించబోయే సినిమాలో ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ లో సునీల్ కనిపించబోతున్నారనేది ఈ న్యూస్.
అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, బహుశా ఈ వార్త కార్యరూపం దాలిస్తే మాత్రం సునీల్ హాస్యాన్ని అమితంగా ఇష్టపడే అభిమానులకు పండగ లాంటిదేనని చెప్పవచ్చు. ఎందుకంటే… శ్రీనువైట్ల – రవితేజ కాంబోలో కమెడియన్ గా నటించిన సందర్భంలో సునీల్ కు అదిరిపోయే క్యారెక్టర్స్ వచ్చాయి. దీంతో లేటెస్ట్ మూవీలో కూడా అదే రేంజ్ కామెడీని సునీల్ నుండి ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మరి అలా సునీల్ కనిపించాలని ఆశించడం, కేవలం ఫ్యాన్స్ మాటే కాదు, హాస్యప్రియుల భావన కూడా!



