సునీల్ హీరోగా నటించిన సినిమా విడుదల కావడం… ఆ తర్వాత అది బాడ్ టాక్ ను సొంతం చేసుకోవడం… దీంతో మళ్ళీ సునీల్ కమెడియన్ గా కొన్ని పాత్రలు ఒప్పుకుంటున్నారని పుకార్లు షికారు చేయడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఈ సారి సునీల్ హీరోగా నటించిన సినిమా విడుదలకు ఓ రెండు రోజులు ముందు ఉందనగా ఈ టాక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. సునీల్ హీరోగా నటించిన “ఉంగరాల రాంబాబు” ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ తరుణంలో సునీల్ మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, తన అత్యంత ఆప్తుడు, స్నేహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడన్న టాక్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న త్రివిక్రమ్, ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో జత కట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడని, అది కూడా కామెడీ క్రియేట్ చేసే పాత్ర అని సందడి చేస్తోన్న టాక్ లో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.
అయితే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ప్రతిసారి కూడా ఈ టాక్ రావడం షరామామూలుగా మారిపోయింది. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సునీల్ కమెడియన్ గా చేస్తున్నాడన్న వార్తలు అప్పట్లో హంగామా సృష్టించాయి. కానీ అలాంటిదేమీ లేదన్న విషయం తెలిసిందే. సునీల్ – త్రివిక్రమ్ కున్న సాన్నిహిత్యం రీత్యా ఇలాంటి పుకార్లు రావడం కామన్ గా మారిపోయింది. ఒక్కసారి హీరోగా చేసిన సునీల్, మళ్ళీ కమెడియన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నది బహిరంగమే.


