ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల మూడవ సభ విజయవాడ పోరంకిలోని అనుమోల్ గార్డెన్స్ లో కన్నుల విందుగా జరిగింది. సభా ప్రాంగణం అంతా ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. పసుపు జెండాలతో సభ కళకళలాడింది. సభ మొత్తంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రసంగం హైలెట్ గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ఎన్టీఆర్ శతజయంతి’ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. సభ మొత్తంలో ఆయన చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు బాలకృష్ణ, చంద్రబాబు గురించి ప్రస్థాసవించినప్పుడు బాబు ఒకింత ఉద్వేగానికి లోనైయ్యారు. ముఖ్యంగా రజినీకాంత్ చంద్రబాబు విజన్ గురించి మాట్లాడినప్పుడు మాత్రం బాబు ముఖంలో ఒకింత ఆనందం, ఒకింత ఆశ్చర్యం, ఒకింత ఉద్వేగం కొట్టొచ్చినట్లు కనిపించాయి.
రజనీకాంత్ “ఎన్టీఆర్” గురించి ఎమన్నారంటే…
ఎన్టీఆర్ యుగపురుషుడని, ఎన్టీఆర్ సినిమా లవకుశ 1963 లో తొలిసారి చూశానని రజిని అన్నారు. తరువాత 1966 లో శ్రీకృష్ణపాండవీయం చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన దుర్యోధనుడి పాత్ర తనని ఎంతగానో ప్రభావితం చేసిందని, ఆ పాత్ర నుండి స్ఫూర్తి పొంది తాను తెలుగు నేర్చుకున్నానని రజిని అన్నారు.
18వ ఏట తాను బస్ కండక్టర్ అయ్యారని, ఆ సమయంలో ఆర్టీసీ వార్షికోత్సవం రోజు కురుక్షేత్రం డ్రామా ప్రదర్శన జరిగిందని, అందులో దుర్యోధనుడి పాత్ర పోషించారని, ఎన్టీఆర్ ని అనుకరిస్తూ చేసిన దుర్యోధనుడి పాత్రకు చాలా ప్రసంశలు వచ్చాయని రజనీకాంత్ తెలిపారు.
1983 సమయంలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 10 లక్షలు ఉండేదని, అంతటి ఆదాయాన్ని సైతం వదులుకుని తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన పట్టుదలగల మహామనిషి ఎన్టీఆర్ అని రజనీకాంత్ అన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోనూ కింగ్, రాజకీయాల్లో కూడా కింగే అని రజనీకాంత్ అన్నారు.
రజనీకాంత్ “చంద్రబాబు” గురించి ఏమన్నారంటే…
చంద్రబాబు దీర్ఘదర్శి, ఒక స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడని, ఆయన శక్తి సామర్ధ్యాలు ఏంటో, బాబుకి ఉన్న ఘనత ఏంటో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి నాయకుడికి తెలుసని, అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నవారి కంటే ఇతర దేశాల్లో ఉన్నవారికి ఇంకా బాగా తెలుసని రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ బాబుని ఉద్దేశించి మాట్లాడిన ఈ మాటలకు సభాప్రాంగణం అంతా జై బాబు జై జై బాబు నినాదాలతో హోరెత్తింది.
చంద్రబాబు 1996 -97 లొనే విజన్ 2020 ప్రణాళిక చేసిన దూరదృష్టి గల నాయకుడని, రాబోయే రోజుల్లో ఐటి రంగం అభివృద్ధి చెందుతుందని ఆనాడే ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు అని, బాబు వల్లే లక్షల సంఖ్యలో విదేశాల్లో ఐటి రంగంలో ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా, సంతోషంగా, విలాసవంతంగా జీవిస్తున్నారంటే దానికి కారణం కేవలం చంద్రబాబే అని రజనీకాంత్ అన్నారు.
హైదరాబాద్ లో ఐటి రంగం ఇంతలా అభివృద్ధి చెందడం బాబు వల్లే సాధ్యమైయ్యిందని, బిలగేట్స్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలను సైతం ఒప్పించి హైదరాబాద్ లో వారి కంపెనీలు పెట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రజిని అన్నారు.
ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని, రాబోయేరోజుల్లో ఆయన సియం అయితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని రజని అన్నారు. అందుకు అవసరమైన దీర్ఘ ప్రణాళిక విజన్ 2040 సిద్ధం చేసుకుని బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని రజిని అన్నారు.
తన ఆప్తమిత్రుడైన చంద్రబాబుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని రజనీకాంత్ అన్నారు. రజినీకాంత్ ప్రసంగం ముగిసిన అనంతరం బాబు రజినీకాంత్ ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో సభాప్రాంగణం అంతా మరోసారి కేరింతలతో మారుమ్రోగింది.



