మనిషి అన్ని జీవుల కంటే చాలా తెలివైనవాడు. అన్ని జంతువులకంటే చాలా ప్రమాదమైనవాడు కూడా. మనుషులు ఆశాజీవులు. కనుక కష్టం వచ్చినప్పుడు మొరపెట్టుకోవడానికి కూడా ఓ దైవికశక్తి అవసరమే.
కనుక మనిషిని నియంత్రించి సన్మార్గంలో నడిపించేందుకు, కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం కల్పించేందుకు ఓ దైవికశక్తి చాలా అవసరం. ఆ శక్తి ప్రాంతాలు, భాషలు, రాష్ట్రాలు, దేశాలను బట్టి వేర్వేరుగా ఉండవచ్చు. కానీ తమ పరిధికి అతీతమైన శక్తి ఒకటి ఉందనే నమ్మకమే ఈ యావత్ ప్రపంచాన్ని నడిపిస్తోంది.
అయితే ఈ నమ్మకంలో నుంచే మూడ నమ్మకాలు కూడా పుట్టుకొస్తున్నాయి. మనుషులకు స్వాంతన చేకూర్చి, సన్మార్గంలో నడిపించాల్సిన కుల, మతాలకు ఉన్మాదులు వక్రభాష్యాలు చెపుతూ అశాంతిని, మారణహోమాలను సృష్టిస్తున్నారు.
అయితే సాధారణ ప్రజల స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తున్నప్పుడు బాధ, ఆందోళన కలుగుతుంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని రామకృష్ణా నగర్‌లో తల్లి, కొడుకు, ముగ్గురు కూతుర్లు కలిసి ఉంటున్నారు. కొడుకు, కూతుర్లు ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు.
ఇటీవల వారిలో శైలజ అనే మహిళ ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తహీనత ఉందని గుర్తించిన వైద్యులు రక్తం ఎక్కించబోతే ‘పరిశుద్ధ రక్తం’ కాదని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆమె చనిపోయింది!
రక్తం ఎక్కించి ప్రాణం కాపాడే అవకాశం ఉన్నప్పటికీ వారి మూడనమ్మకం వలన ఆమె చనిపోవడమే విషాదం. అంతకంటే విషాదం ఆమెని జీసస్ మళ్ళీ బ్రతికిస్తాడని నాలుగు రోజులుగా ఆమె శవాన్ని ఇంట్లో ఉంచుకోవడం!
దేవుడిపై భక్తి, నమ్మకం అవసరమే. కానీ ప్రాణాలు పోగొట్టుకునేంత మూడ నమ్మకాలే సరికాదు. సమాచారం అందుకున్న పోలీసులు బలవంతంగా ఆమె శవాన్ని స్వగ్రామానికి తరలింపజేసి అంత్యక్రియలు చేయించారు.






