వీలైనంత త్వరగా పరిపాలన అంతా విశాఖపట్నంకు తరలించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరిక తీరేలా కనిపించడం లేదు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
ప్రభుత్వం తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది రాకేష్ ద్రివేది ఈ కేసు తేలే వరకు కనీసం పరిపాలన రాజధానిని వైజాగ్‌కి మార్చడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అయితే దానికి కూడా అత్యున్నత న్యాయస్థానం ఒప్పుకోకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
“హైకోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే వైజాగ్‌కు రాజధానిని తరలించే ఖర్చు వృథా కదా? ఆ ఖర్చుకు ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రశ్నలు సంధించారు. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోయింది. అనంతరం హైకోర్టులో విచారణ తర్వాతే ఏదైనా అని ధర్మాసనం తెలిపింది.
దీనితో రాజధాని తరలింపు మరికొంత కాలం వాయిదా పడినట్టే అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ తీర్పుని అమరావతికి భూములిచ్చిన రైతులు స్వాగతించారు. ఇది ఇలా ఉండగా… పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు రేపు విచారణ జరగనుంది.





