కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరు సీఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో సహా మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై, రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలాగే అధికారులను బెదిరిస్తూనే ఉన్నారు.
సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు సామాన్య మహిళలను విడిచిపెడతారని అనుకోలేము. సోషల్ మీడియాలో ఇంత అరాచకం జరుగుతున్నా ప్రభుత్వ స్పందన తగురీతిలో లేకపోయింది. కనుక దీనిని చాతగానితనంగా భావించి వారు ఇంకా చెలరేగిపోతూనే ఉన్నారు.
ఇందుకు తాజా ఉదాహరణ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ అనుచిత వ్యాఖ్యలు చేయడమే. ఈ కేసులో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు కూడా.
అయితే సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ఈ కాలకేయ సైన్యాన్ని కట్టడి చేయకపోతే రాష్ట్రంలో ఎవరికీ భద్రత ఉండదని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించి, తన కార్యాలయంలో ప్రత్యేకంగా ‘టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
ఈ ప్రకటన రాజకీయ వర్గాలను ఆలోచింపజేస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ రెండేళ్లలో పలు సందర్భాలలో నేనే గనుక హోంమంత్రిని అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉంటాయో చూపిస్తానన్నారు.
కనుక సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే హోంశాఖ చేపట్టాలనే ఆలోచన ఉన్నట్లు పవన్ కళ్యాణ్ మాటలతో అర్థమవుతోంది. ఇప్పుడు తన అధీనంలో పనిచేసే ‘టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేయడంతో మరోసారి గుర్తుచేశారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.
ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు అనుమతితోనే పవన్ కళ్యాణ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఉంటే, రాబోయే రోజుల్లో ఆయనకు తప్పకుండా హోంశాఖ అప్పగించవచ్చు. ఒకవేళ అలాంటి ఆలోచన, ప్రతిపాదన లేకున్నా మరో కోణం కూడా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ జోక్యంతోనే ‘ప్రశ్న రావణ్’ అరెస్ట్ జరిగింది కనుక సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న మూకల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకోవడం కంటే పవన్ కళ్యాణ్‌కే ఈ బాధ్యత అప్పగించడమే మేలని భావిస్తుండవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లు పవన్ కళ్యాణ్‌కు హోంశాఖ అప్పగించినట్లయితే, సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ఈ కాలకేయ సైన్యాన్ని ఆయన సులువుగా కట్టడి చేయగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






