వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సుప్రీంకోర్టు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను, మంగళవారం వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనపెట్టేసింది. అంతేకాకుండా… వివేకా హత్యకేసు విచారణను మరో రెండు నెలలకు అంటే జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.
సుప్రీంకోర్టు స్వయంగా ఈ తీర్పు వెలువరించింది కనుక అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా ఇంకా ఏ కోర్టు కూడా ఆపలేదు. ఆయనను అరెస్ట్ చేయాలనుకొంటున్నామని సీబీఐ అధికారులు ఇదివరకే హైకోర్టుకి తెలియజేశారు కనుక ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చు. ఆయనని సీబీఐ నేడే అరెస్ట్ చేస్తుందా లేక రేపో ఎల్లుండో చేస్తుందా?అనేదే తెలియవలసి ఉంది.
ఇక ఈ కేసు విచారణకు సీబీఐకి ఏకంగా రెండు నెలల సమయం ఇవ్వడాన్ని యాదృచ్ఛికంగా చూడలేము. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను విచారిస్తున్న సీబీఐకి ఇంకా వారి వెనుక ఎవరెవరున్నారు?అని కనుగొనేందుకే సీబీఐకి గడువు ఇచ్చిన్నట్లు భావించవచ్చు. అంటే రాబోయే రెండు నెలల్లో వివేకా హత్యకేసులో మరిన్ని పెద్ద చేపలను సీబీఐ వలవేసి పట్టుకోబోతోందని భావించవచ్చు.
అయితే ఈ కేసులు, విచారణ, అరెస్టులు, బెయిలు అన్నీ రాజకీయ అస్త్రాలని, కనుక అవి రాజకీయ ప్రయోజనాలతో కూడా ముడిపడుతుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఈ కేసు విచారణ ఎప్పుడు వేగం పుంజుకొంటుందో, ఎప్పుడు అటకెక్కిపోతుందో అంతా వర్తమాన రాజకీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని భావించవచ్చు.
లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నేడో రేపో అరెస్ట్ కావచ్చునని అందరూ భావిస్తున్నవేళ, హటాత్తుగా ఆ కేసు విచారణ నిలిచిపోవడమే ఇందుకు తాజా నిదర్శనంగా కనబడుతోంది. కనుక వివేకా హత్య కేసు విచారణ కూడా మున్ముందు ఏ మలుపైనా తిరగవచ్చు.



