రైల్వే బడ్జెట్ – తెలుగు రాష్ట్రాలకు “న్యాయం” జరిగింది!

suresh prabhu railway budget 2016మోడీ నాయకత్వంలో సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా రైల్వే బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశపెట్టారు. ఎలాంటి భారీ ప్రాజెక్ట్ లు ప్రకటించకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో “న్యాయం” చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే, కాంగ్రెస్ హయంలో గానీ, గతేడాది ఎన్డీయే ప్రకటించిన ప్రాజెక్ట్ లే ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ప్రకటించినా కూడా, గత అనుభవాల దృష్ట్యా అవన్నీ కంటి తుడుపు చర్యలేనని భావించే పరిస్థితి నెలకొంది. దీంతో పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసినా చాలానే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఉంది. ఇక, ప్రస్తుత బడ్జెట్ ను పరిశీలిస్తే…

ఏపీకి దక్కాల్సిన విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశం అసలు ప్రస్తావనలోకి రాకపోగా, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఏ ప్రాజెక్టుకూ నిధులు కేటాయించినట్టు సురేష్ ప్రభు ప్రకటించలేదు. ప్రధానమైన నడికుడి – శ్రీకాళహస్తి, మాచర్ల – మిర్యాలగూడ, గుంటూరు – గుంతకల్ విద్యుదీకరణ, భువనగిరి – నడికుడి విద్యుదీకరణ, యాదాద్రి వరకూ మెట్రో విస్తరణ, కడప – బెంగళూరు, కోటిపల్లి – నర్సాపూర్, కాకినాడ – పిఠాపురం, తుమ్కూరు – రాయదుర్గం, భీమవరం – నర్సాపురం – నిడదవోలు డబ్లింగ్, దేవరపల్లి – పెనుగొండ లైన్ వంటి అంశాల గురించిన ప్రస్తావనలు ఏమీ లేవు.

ADVERTISEMENT

ఇక, తెలంగాణ సర్కారు భాగస్వామ్యంతో కొన్ని ప్రాజెక్టులు చేపడతామని, హైదరాబాద్ సబర్బన్ రైల్వే వ్యవస్థను విస్తరిస్తామన్న మాట తప్ప మరో ప్రస్తావన లేదు. ఏపీ విషయానికి వస్తే, ఆథ్యాత్మిక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా తిరుపతి స్టేషన్ పేరు ఓ మారు వినిపించింది. విజయవాడ – ఖరగ్ పూర్ మధ్య మూడవ లైన్ ను నిర్మిస్తామని చెప్పారే తప్ప, పనులు ఎప్పుడు మొదలవుతాయన్న విషయాన్ని గానీ నిధుల కేటాయింపునూ వెల్లడించకుండానే సురేష్ ప్రభు తదుపరి అంశానికి వెళ్లిపోయారు. నాగపూర్ – విజయవాడ మధ్య వాణిజ్య రైల్వే లైన్ ను ప్రతిపాదించారు. ఈ అంశాలు మినహా తెలుగు రాష్ట్రాలకు దక్కిందేమీ లేదు.

ADVERTISEMENT
Latest Stories