మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్… పరిచయం అవసరం లేని పేరు. క్రికెట్ ప్రపంచాన్ని శాశించిన ఈ మాస్టర్ బ్లాస్టర్, ఇప్పుడు మ్యాచ్ ఫలితాలను కూడా ముందుగా అంచనాలు వేస్తూ సందడి చేస్తున్నాడు. ఆదివారం నాడు జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో… ఇంగ్లాండ్ విధించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలోపే టీమిండియా చేధిస్తుందని ట్వీట్ చేసాడు. సచిన్ చెప్పినట్లుగానే టీమిండియా 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని సిరీస్ విజేతగా నిలిచింది.
రోహిత్ శర్మ అజేయమైన సెంచరీ (56 బంతుల్లో 11ఫోర్లు, 5 సిక్సర్ల)తో కదం తొక్కగా, విరాట్ కోహ్లి 29 బంతుల్లో 43, హార్దిక్ పాండ్యా 14 బంతుల్లో 33 పరుగులతో రాణించడంతో భారీ లక్ష్యాన్ని అవలీలగా సాధించింది. అంతకుముందు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు ఇచ్చిన అద్భుతమైన ఓపెనింగ్ తో 220కు పైగా పరుగులు నమోదు చేస్తుందని భావించగా, హార్దిక్ పాండ్య 4 వికెట్లతో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. దీంతో 2-1 తేడాతో టీమిండియా వరుసగా 7వ టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇంటర్నేషనల్ టీ20లో మూడు సెంచరీలు చేసిన రెండవ క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు అందుకున్నాడు. అలాగే 2000 పరుగులు సాధించిన అయిదవ బ్యాట్స్ మెన్ గా రోహిత్ పేరు నిలిచింది. ఇక మహేంద్ర సింగ్ ధోని ఒకే ఇన్నింగ్స్ లో అయిదు క్యాచ్ లు అందుకున్న క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అలాగే టీ20లో 50 క్యాచ్ లు అందుకున్న తొలి వికెట్ కీపర్ గా కూడా రికార్డును సాధించాడు.



