తెలంగాణలో తమను ఇబ్బంది పెట్టిన చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నారు తెరాస నేతలు. సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస యాదవ్ ను ఓడించడానికి తెలుగుదేశం నేతలు విశ్వప్రయత్నం చెయ్యడంతో ఆయన టీడీపీ పై పగ పట్టేశారు. నెలకోసారి విజయవాడ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీలను దూరం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు తలసాని.
మార్చి 3న గుంటూరులో ఏపీ బీసీ నేతలతో సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు తలసాని. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తనకు 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఆ రాష్ట్ర బీసీలను ఏకం చేస్తానని తలసాని చెప్పుకొచ్చారు. ఈ సారి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమి తధ్యమని ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే అధికార టీడీపీ ఓట్లే చీలుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తలసాని ఈ మధ్య చంద్రబాబుని తిట్టిపోయడం వల్లే ఆయన ఆ పని తీరుకు ఇంప్రెస్స్ అయ్యి ఆయనను మరోసారి మంత్రిని చేశారు కేసీఆర్ అని అంతా అంటూ ఉంటారు. టీడీపీలోనే పుట్టి పెరిగిన తలసాని గతంలో చంద్రబాబుకు వీర విధేయుడిగా ఉండేవారు. టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని అప్పట్లో గట్టిగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయన పక్కా తెలంగాణవాది అయిపోయి తెలంగాణ రాష్ట్ర సమితి పంచన చేరారు. రాజకీయాలలో ఇటువంటి చిత్రాలు విచిత్రం ఏమీ కాదు.



