తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సోమవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె రాజీనామా బీజేపీకి కూడా చాలా అవసరమే. ఎలా అంటే, ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళక తప్పదు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీ స్వయంకృతం వలన ఓడిపోయింది. కానీ గత ఎన్నికలలో బీజేపీ ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోగా ఈసారి 8 సీట్లు గెలుచుకుంది. అలాగే బీజేపీ ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. త్వరలో జరుగబోతున్నే లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 సీట్లలో కనీసం 8-10 సీట్లు గెలుచుకొని మరింత పట్టు సాధించాలని చాలా పట్టుదలగా శ్రమిస్తోంది.
మరోపక్క తెలంగాణలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే బలపడుతోంది. బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవడంతో బిఆర్ఎస్ పార్టీలో అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నేతల్లో భయాందోళనలు మొదలైంది. దీంతో పలువురు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరిపోతున్నారు.
కనుక కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ నేతలను ఆకర్షించి తెలంగాణలో బలపడితే 2028లో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో దానిని ఓడించడానికి బీజేపీకి చాలా శ్రమించాల్సి వస్తుంది. కనుక తెలంగాణలో బిఆర్ఎస్ పూర్తిగా నిర్వీర్యం కాక మునుపే బీజేపీ కూడా బలపడాల్సి ఉంటుంది. దీనికి బీజేపీ డెడ్‌లైన్ కూడా పెట్టుకొని పనిచేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత తన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బిఆర్ఎస్, బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకొంటున్నారు కూడా. కనుక తమిళిసై సౌందరరాజన్ ఇప్పుడు రాజీనామా చేయడం బీజేపీకి కూడా చాలా అవసరమే.
తాము గవర్నర్‌గా నియమించే వ్యక్తి తమిళిసైలాగ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూ, ఆయనకు తోడ్పడుతుండాలని బీజేపీ కోరుకోదు కదా?కనుక ఆమెకు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చి తమిళనాడు పంపించేసి, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నప్పుడు బీజేపీకి తోడ్పడగల సరైన వ్యక్తిని గవర్నర్‌గా నియమించవచ్చు. ఇది నిజమో కాదో త్వరలోనే తేలిపోతుంది.




