ఈసారి శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటంతో ఈ ప్రభావం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలలో కనిపించబోతోంది. టిడిపికి ఉభయ గోదావరి జిల్లాలపై మొదటి నుంచి పట్టుంది. అలాగే పవన్ కళ్యాణ్‌కు ఉభయగోదావరి జిల్లాలలో భారీగా అభిమానులు, కాపు సామాజిక వర్గం మద్దతు లభిస్తోంది.
బీజేపీకి కూడా ఉభయ గోదావరి జిల్లాలలో మంచి పట్టు ఉంది. కనుక ఈ మూడు పార్టీలు చేతులు కలిపి కూటమిగా పోటీ చేస్తుండటంతో అవి మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నాయి.
ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తునందున ఆ సీటు జనసేన ఖాతాలోనే పడటం ఖాయంగానే భావించవచ్చు. అయితే పవన్ కళ్యాణ్‌ని ఎట్టి పరిస్థితులలో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నందున వైసీపి అభ్యర్ధి వంగా గీతని గెలిపించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదని చెప్పేశారు.
ఈవిషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఒకవేళ ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతే అది ఆయనకు, జనసేన పార్టీకి కూడా చాలా నష్టం కలిగిస్తుంది. కనుక పిఠాపురంలో కేవలం గెలవడం కాదు… కనీసం 50వేలకు పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి జనసేన నేతలు, కార్యకర్తలు చాలా శ్రమిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, ఉండి, దెందలూరు, ఏలూరు సీట్లు కూటమి ఖాతాలోనే పడబోతున్నాయి. భీమవరం, నిడదవోలులో వైసీపి నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ చివరికి కూటమివైపే ప్రజలు మొగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
పొత్తులో భాగంగా నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం మూడు సీట్లు జనసేనకు దక్కాయి. నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు ముగ్గురూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పోలవరంలో మాత్రం వైసీపికి అనుకూలంగా ఉంది. అక్కడ నుంచి వైసీపి అభ్యర్ధిగా తెల్లం రాజ్యాలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఉంగటూరు, చింతలపూడి, గోపాలాపురం మూడు నియోజకవర్గాలలో వైసీపి, కూటమి మద్య హోరాహోరీగా పోరు జరుగబోతోంది. ఈసారి మంత్రి తానేటి వనిత గోపాలాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గంపై ఆమె కుటుంబానికి పూర్తి పట్టు ఉంది. కనుక అక్కడా ఆమె గెలిచే అవకాశం చాలా ఉంది.
ఉభయగోదావరి జిల్లాలలో పరిస్థితులు కూటమికి అనుకూలంగా మారగా, ఈసారి నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో వైసీపికి ఎదురుగాలి వీస్తోంది. కనుక ఈ మూడు జిల్లాలలో కూటమి పూర్తి పట్టు సాధించగలిగితే ఎన్నికలలో విజయం సాధించడం తధ్యం.




