టిడిపి, జనసేనలు తొలి జాబితా ప్రకటించగానే ఊహించిన్నట్లే పవన్ కళ్యాణ్ వీరాభిమానులు చాలా బాధపడ్డారు…. ఆవేశపడ్డారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, రాంగోపాల్ వర్మ వంటి కొందరు శ్రేయోభిలాషులు పవన్ కళ్యాణ్‌ని దెప్పిపొడిచారు.
శ్రేయోభిలాషుల సన్నాయి నొక్కులు దేనికో అర్దం చేసుకోవచ్చు. అలాగే తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న వీరాభిమానుల ఆవేశాన్ని కూడా అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఈ వీరాభిమానులందరూ గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్‌ని కనీసం ఒక్క చోట కూడా ఎందుకు గెలిపించుకోలేకపోయారు?ఇంత వీరాభిమానులు ఉంటే గత ఎన్నికలలో జనసేన ఎందుకు ఓడిపోయింది?అప్పుడే గెలిపించుకొని ఉంటే వారి కోరిక ప్రకారం పవన్ కళ్యాణ్ అప్పుడే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు కదా?జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు గెలిపించుకోలేక, ఇప్పుడు టిడిపితో కలిసినప్పుడు గెలిపించుకోలేకపోతే మరెప్పుడు గెలిపించుకుంటారు?
‘నాకు చప్పట్లు కాదు ఓట్లు వేసి మీ అభిమానం చాటుకోండని’ పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్నా తెలంగాణలో జనసేన పోటీ చేసిన 8 సీట్లలో ఓడిపోయింది కదా? వారాహి యాత్రలకు పవన్ వీరాభిమానులు వేలాదిగా తరలివస్తే అదే ప్రజాబలం అయిపోదు. అదే ఎన్నికలలో గెలిపించేయలేదనే సత్యాన్ని గ్రహించాలి.
పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వాస్తవ రాజకీయ పరిస్థితులను గుర్తించకుండా జనసేనకు 60-70 సీట్లు, ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంటే టిడిపి, జనసేనలు రెండూ నష్టపోతాయి. వైసీపి ఇదే కోరుకుంటోంది కనుకనే 60-70 సీట్లు తీసుకోవాలని తమని రెచ్చగొడుతోందని జనసైనికులు గ్రహించడం చాలా అవసరం.
పవన్ కళ్యాణ్ ఈ వాస్తవాలన్నిటినీ పరిగణనలోకి తీసుకునే, ముందు వైసీపిని ఓడించి అధికారంలోకి రావడమే చాలా ముఖ్యం అని గ్రహించినందునే 24 సీట్లకు అంగీకరించారనే విషయం ఆయన వీరాభిమానులు గ్రహించాలి. కాదంటే ఆయన నిర్ణయాన్ని, రాజకీయ విచక్షత పట్ల వారికి కూడా నమ్మకం లేదని భావించాల్సి ఉంటుంది.
జనసేనకు కనీసం 60-70 సీట్లు కావాలని కోరుకొంటున్నవారు రేపు జరుగబోయే ఎన్నికలలో ఈ 24 మంది అభ్యర్ధులను భారీ మెజార్టీతో తప్పకుండా గెలిపించుకొంటామని పవన్ కళ్యాణ్‌కు హామీ ఇవ్వగలరా?
కాపు సామాజిక వర్గానికి కూడా 24 సీట్ల పట్ల తీవ్ర అసంతృప్తి కలగడం సహజమే. కానీ ఏపీలో నెలకొన్న ‘చొక్కా మడత పెట్టిన యుద్ధ వాతావరణం’ని చూస్తూనే ఉన్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో వైసీపి గెలిచి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిస్థితి, జనసేన పరిస్థితి గురించి వారికి తెలుసు. కనుక ఈ చేదు నిజాలను అంగీకరిస్తే ఈ సీట్ల సర్దుబాట్లని తప్పక అంగీకరిస్తారు.
చివరిగా ఒక్క మాట. టిడిపి, జనసేనల పొత్తు విచ్ఛిన్నం అయిపోవాలని, రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే సులువుగా ఓడించవచ్చని వైసీపి కోరుకొంటోంది. కానీ అలా జరగకుండా చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌ని అభిమానించేవారు, కాపు సామాజిక వర్గానిదే.




