పొత్తులతో యుద్ధానికి సిద్దమవుతున్న వేళ కూడా తగ్గేదేలే!

TDP-JanaSena-YSRCP-BJP

ఓ వైపు ఢిల్లీలో టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాట్ల చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి నాలుగోసారి సిద్దం సభకి సిద్దం అవుతున్నారు. పొత్తులు, సిద్ధం, యుద్ధం దేనిదారి దానిదే అన్నట్లు అటు టిడిపి, ఇటు వైసీపి కూడా మరికొన్ని నియోజకవర్గాలకు శుక్రవారం అభ్యర్ధులను ప్రకటించాయి.

టిడిపి ప్రకాశం జిల్లాలో దర్శి శాసనసభ నియోజకవర్గానికి గోరంట్ల రవి కుమార్, రైల్వేకోడూరుకి ముక్కా రూపానందరెడ్డిలను ఇన్‌చార్జిలుగా నియమించింది. ఈ మేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు అధికార ప్రకటన జారీ చేశారు.

ADVERTISEMENT

మరోవైపు వైసీపి కూడా శుక్రవారం 11వ జాబితా విడుదల చేసింది. దానిలో రెండు లోక్‌సభ, ఒక శాసనసభ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌చార్జిలని ప్రకటించింది. కర్నూలు, అమలాపురం లోక్‌సభ స్థానాలకు బీవై రామయ్య, రాపాక వరప్రసాద్‌లను, రాజోలు శాసనసభ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ఖరారు చేసి ప్రకటించింది.

మంత్రి గుమ్మనూరు జయరాంని కర్నూలు నుంచి లోక్‌సభకు పోటీ చేయవలసిందిగా జగన్మోహన్‌ రెడ్డి కోరగా, అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరిపోయారు. కనుక బీవై రామయ్యని కర్నూలు లోక్‌సభ అభ్యర్ధిగా ఖరారు చేయవలసి వచ్చింది.

ఈ 11వ జాబితాతో కలిపి వైసీపి ఇప్పటి వరకు 175 శాసనసభ నియోజకవర్గాలకు 75 మంది, 25 ఎంపీ స్థానాలకు 23 మంది అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది.

లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి జగన్‌ టికెట్స్ ఇస్తున్నప్పటికీ, వారికి బలమున్న నియోజకవర్గాలలో కాకుండా వేరే చోట ఇస్తుండటం లేదా వారికి కేటాయించిన నియోజకవర్గాలలో పార్టీలోని వారి ప్రత్యర్ధులను పక్కలో బల్లెంలా పెడుతుండటంతో చాలా మంది పార్టీని వీడుతున్నారు.

ఈ జాబితాలు, మార్పులు చేర్పులు, రాజీనామాలు, వలసలు, సస్పెన్షన్లతో పార్టీ క్యాడర్‌లో తీవ్ర అయోమయం, అసంతృప్తి, అసహనం నెలకొంది. కనుక 175/25 స్థానాలలో వైసీపి గెలుపు దేవుడెరుగు…. కానీ ఈ జాబితాలే వైసీపి కొంపముంచేలా ఉన్నాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొని 118 స్థానాలకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించాయి. ఇప్పుడు వాటితో బీజేపీ కూడా పొత్తు పెట్టుకోబోతోంది. మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుని మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటించబోతున్నాయి.

కానీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తూ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి ప్యాలస్‌లో ఎంత కసరత్తు చేస్తున్నా ఇంతవరకు 175 స్థానాలకు వైసీపి అభ్యర్ధులను ప్రకటించలేకపోయారు.

ADVERTISEMENT
Latest Stories