టిడిపి, జనసేనలు తొలి జాబితా విడుదల చేసిన తర్వాత తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా సభ’ విజయవంతం అవడం ప్రజలు వాటి పొత్తులకి సంఘీభావం తెలిపి, మార్పు కోరుకొంటున్నారని చెప్పిన్నట్లయింది.
మళ్ళీ రెండు పార్టీలు కలిసి ఈ నెల 17న చిలుకలూరిపేటలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ సభలో ఉమ్మడి మ్యానిఫెస్టోని ప్రకటించబోతున్నామని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు తెలిపారు.
తాము ప్రకటించిన అభ్యర్ధుల జాబితాని చూసి, ఆందోళన చెందుతున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన పార్టీ అభ్యర్ధులను మార్చుకొంటున్నారని అచ్చన్నాయుడు ఎద్దేవా చేశారు.
ఏపీలో రాజకీయాలు ఇలా సాగుతుంటే, మరోపక్క ఢిల్లీలో బీజేపీ అధిష్టానం ఏపీలో పొత్తుల గురించి ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సుదీర్గంగా చర్చిస్తోంది. నిజానికి నిన్ననే ఈ విషయం తేల్చేయాలనుకున్నప్పటికీ, నేడు కూడా చర్చిస్తోంది. పొత్తుల విషయం అమీతుమీ తేల్చుకోవడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత సమావేశంలోనే టిడిపిని ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించారు. కానీ ఏపీలో సీట్ల సర్దుబాట్లపై సందిగ్దత నెలకొని ఉండటంతో బీజేపీ, టిడిపిల మద్య చర్యలు కొనసాగుతున్నాయి. కనుక చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనతో పొత్తులు విషయం తేలిపోవచ్చు.
ఒకవేళ బీజేపీ కూడా వాటితో కలిస్తే, ఉమ్మడి మ్యానిఫెస్టోలో బీజేపీ హామీలు కూడా చేరుతాయి. కనుక మూడు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోమరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఈ నెల 17న జరిగే సభలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే దానికి కేటాయించిన సీట్లు, అభ్యర్ధుల జాబితాను వెల్లడించుకోగలుగుతుంది.
ఒకవేళ ఏ కారణం చేతయినా టిడిపి, జనసేనలతో బీజేపీ కలవకపోతే, 17న జరిగే సభలో మిగిలిన 58 మంది అభ్యర్ధులతో టిడిపి, జనసేనలు తుది జాబితాని ప్రకటించడానికి మార్గం సుగమం అవుతుంది. కనుక ఏవిదంగా చూసినా మార్చి 17న చిలుకలూరిపేటలో జరుగబోయే బహిరంగ సభ చాలా కీలకమని భావించవచ్చు.






