కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో యుద్ధాలు… ఏపీలో షరా మామూలే!

TDP-JanaSena-YSRCP-BJPకర్ణాటకలో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుండటంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మరింత ఉత్సాహంగా ఉన్నారు. కర్ణాటక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని కనుక, “బిజెపి, బిఆర్ఎస్‌లో నేతలందరూ రారండోయ్… కాంగ్రెస్ పార్టీలోకి అందరూ రారండోయ్,” అంటూ హుషారుగా ఆహ్వానిస్తున్నారు.

అయితే కాంగ్రెస్‌కు అంత సీన్ లేదని బిజెపి, కాంగ్రెస్‌ విజయాన్ని పట్టించుకోనవసరం లేదని కేసీఆర్‌ తేల్చిపారేశారు. ఇంతకాలం కాంగ్రెస్‌, బిజెపిలకు దేశంలో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వలననే, అవి అధికారంలోకి రాగలుగుతున్నాయని, కర్ణాటకలో అదే జరిగిందని, కానీ ఇప్పుడు కేసీఆర్‌ వచ్చారని, కనుక ఇక వాటి ఆటలు సాగవని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు కాస్త వేడెక్కాయి.

ADVERTISEMENT

కేసీఆర్‌ వచ్చే ఎన్నికలలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని, 95-105 సీట్లు మనమే గెలుచుకోబోతున్నామని కేసీఆర్‌ చెప్పడాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడకుండా పట్టి ఉంచేందుకే కేసీఆర్‌ వారిని ఈ మాయమాటలతో మభ్యపెడుతున్నారని రేవంత్‌ రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించి, బిజెపిని గెలిపించేందుకే కేసీఆర్‌ కుమారస్వామికి మద్దతు పలికారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

బిజెపి-బిఆర్ఎస్‌ వేర్వేరు కావనే విషయం కర్ణాటక ఎన్నికలలో మరోసారి రుజువైంది కనుక, బిజెపిలో చేరిన కాంగ్రెస్‌ నేతలందరూ వెనక్కు తిరిగిరావాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వెళ్ళిన ఈటల రాజేందర్‌ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ వ్యతిరేకశక్తుల పునరేకీకరణ కోసం అందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన సమయం ఇదేనని, వేర్వేరుగా ఎంతకాలం పోరాడినా కేసీఆర్‌ను గద్దె దించలేమని రేవంత్‌ రెడ్డి అన్నారు. బిజెపిలో నేతలు కాంగ్రెస్‌లోకి వస్తానంటే వారి కోసం ఒకటి కాదు… పది మెట్లు దిగేందుకు సిద్దంగా ఉన్నానని రేవంత్‌ రెడ్డి అన్నారు.

అయితే కాంగ్రెస్‌లో నుంచి బిజెపిలోకి వెళ్ళిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గాలి తీసేశారు. “అదో పార్టీ… దానిలో నాలుగు గ్రూపులు… ఎవరిపాదయాత్రలు వారివే… ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు… ఎన్నికల గంట ఇంకా మ్రోగకమునుపే కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకొంటున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేదు. పైగా కేంద్రంలో అధికారంలో కూడా లేదు. మరి కేసీఆర్‌ని ఏవిదంగా ఓడించగలమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది? కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలు రాజకీయంగా మనుగడ సాగించాలనుకొంటే అందరూ బిజెపిలోకి వచ్చేస్తే మంచిది. లేకుంటే వచ్చే ఎన్నికల తర్వాత అందరూ కనబడకుండా పోతారు,” అని హెచ్చరించారు.

కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఈస్థాయిలో యుద్ధాలు చేసుకొంటుంటే, ఏపీలో పార్టీలు వాటిని పట్టించుకోకపోవడం విశేషం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో కూడా తెలీని పరిస్థితి కాగా ఏపీలో బిజెపి ఉన్నప్పటికీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రెండు జాతీయపార్టీల పరిస్థితి ఈవిదంగా ఉండటంతో వైసీపీతో టిడిపి, జనసేనల మద్య రాజకీయ ఆధిపత్యపోరు యధాప్రకారం కొనసాగుతోంది. కనుక కర్ణాటక ఫలితాలను అవి పెద్దగా పట్టించుకోలేదు.

ADVERTISEMENT
Latest Stories