తమ్ముడు తమ్ముడే… పేకాట పేకాటే… అన్నట్లు జగన్ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో గుంతలుపడి చెరువుల్లా మారిన రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. కనుక సంక్షేమ పధకాలు కాస్త పక్కన పెట్టి ముందు రోడ్లు మరమత్తులు చేయించు మహాప్రభో అని అనకాపల్లి టిడిపి నేతలు, కార్యకర్తలు సిఎం జగన్మోహన్ రెడ్డిని వేడుకొంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు, టిడిపి చోడవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబుల అధ్వర్యంలో సోమవారం టి.అర్జాపురం నుంచి రావికమతం మండలం కేంద్రం వరకు పాదయాత్ర చేస్తూ బీఎన్ రోడ్డు గుంతలు పడి చెరువులుగా మారిన రోడ్డుపై నిలబడి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నాలుగు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే గ్రామాలను కలిపే రోడ్ల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు. రోడ్ల దుస్థితిపై ప్రజలు నిలదీస్తారనే భయంతో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు గడప గడపకి కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా రావడం లేదని అన్నారు. మండల స్థాయిలో రోడ్లనే మరమత్తులు చేయించడం చేతకాని ముఖ్యమంత్రి ఇక రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి చేయగలడు? అని టిడిపి నేతలు ప్రశ్నించారు.
ఈ పాదయాత్రలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గునూరు మల్లు నాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడు, స్థానిక టిడిపి నాయకులు దొంకిన అప్పలనాయుడు, వియ్యపు అప్పారావు, సర్పంచ్‌లు, ఏపీటీసీ సభ్యులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.



