తెలంగాణ రాజకీయాలలో బీజేపీ పార్టీ దొంగ – పోలీస్ ఆట ఆడుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని సార్లు దొంగ మాదిరి తెలంగాణ రాజకీయాల నుండి మాయమైపోతుంది, మరికొన్ని సార్లు పోలీస్ మాదిరి తెలంగాణ రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది.
టి. బీజేపీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినపడే ప్రశ్న. బండి సంజయ్ టి. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సైతం వెనక్కి నెట్టి బీజేపీ రెండవ స్థానంలోకి వచ్చేసిందని నమ్మే అంతలా టి. బీజేపీ చాల దూకుడైన రాజకీయాలు నడిపింది.
ఇక బండి సంజయ్ నుంచి రాష్ట్ర పార్టీ బాధ్యతలు చేతులు మారడంతో స్లో అయిన బీజేపీ ఒక్కోసారి అటు బిఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కొటున్నట్టు కనిపిస్తుంది. మరోసారి అదే బిఆర్ఎస్ కు తెరచాటు సాయం అందిస్తున్నట్టు, ఇదే కాంగ్రెస్ నేతలతో తెరచాటు రాజకీయం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాలలోకి బీసీ నినాదంతో తీన్మార్ మల్లన్న TRP రూపంలో కుల పార్టీలకు పునాది వేశారు. ఇక బిఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ తెలంగాణలో మరోపార్టీకి ప్రాణం పోసేలా కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ అంటూ బిఆర్ఎస్ ముఖ్యనేతలందరు కేసుల వలయంలో చిక్కుకుంటున్నారు.
అలాగే రాష్ట్ర ప్రతిపక్ష నేత, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా యూరియా కొరత, ఉద్యోగాల సృష్టి లో వెనకబడి విమర్శలు ఎదుర్కొంటుంది. దానికి తోడు భారీ వర్షాల రూపంలో వరదలు తెలంగాణను వెంటాడుతున్నాయి.
బాధితులు కూడా ప్రభుత్వ సాయం మీద అసంతృప్తిగా ఉన్నారు. ఇలా అటు అధికార పార్టీకి వచ్చే ప్రజా వ్యతిరేకత, ఇటు ప్రతిపక్ష పార్టీ పై వస్తున్న అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి చక్కనైన మార్గాలు. కానీ ఇటువంటి రాజకీయ వ్యాక్యూమ్ ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా కాష్ చేసుకోలేకపోతుంది.
తన పార్టీకి రాజకీయ ప్రయోజాన్ని సంపాధించుకోలేకపోతుంది. తెలంగాణ రాజకీయాలలో అధికార – ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు అందిస్తున్నపప్టికి వాటిని అందుకోవడంలో కానీ, తమ పార్టీకి సానుకూలంగా మలుచుకోవడంలో కానీ బీజేపీ ఎప్పుడు నాలుగు అడుగులు వెనకే ఉంటుంది.
అలాగే తాజాగా జరిగిన రాష్ట్ర అధ్యక్ష మార్పు కూడా బీజేపీ లో అసంతృప్తిని తెచ్చిపెట్టిందని, ఆ కారణంగానే బిఆర్ఎస్ పై విమర్శల కత్తులు దూసే సీనియర్ రాజకీయ నేత ఈటెల తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బీజేపీ లో సైలెంట్ అయ్యారనే వాదన వినిపిస్తుంది.
ఇక త్వరలో రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరుకు కాంగ్రెస్ – బిఆర్ఎస్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే టి.బీజేపీ లో ఉప ఎన్నికల ఊసే కానరావడం లేదు. అయితే ఇలా ఒక్కోసారి ఉత్సాహంగా మరోసారి నిరుత్సాహంగా తెలంగాణ లో బీజేపీ రాజకీయ చెయ్యడంలో అధిష్టానం హస్తం ఉందా.? లేకుంటే రాష్ట్ర స్థాయి నాయకులే టి. బీజేపీ ని ఇంతకు మించి ఎదగనివ్వడం లేదా.?






