నటులు రాజకీయాలలోకి రావడం సహజమైపోయింది. ఇపుడు ట్రెండ్ రివర్స్ గా మారినట్లుంది. రాజకీయ నేతలు పెద్ద నటులుగా మారిపోతూ యాక్టింగ్ చేస్తుండడం నయా ట్రెండ్ గా కొనసాగుతోంది. ఆ మాటకొస్తే… తెర మీద కనిపించే నటన ఏముంది, రియల్ లైఫ్ లో అంతకు మించిన విన్యాసాలను ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వంటి వారే ప్రదర్శిస్తుండడం విశేషం.
అందుకు తాజా ఉదాహరణగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో హైదరాబాద్ లో ఏర్పడిన పరిస్థితులు మరియు బాబుకు పెద్ద ఎత్తున లభించిన మద్దతును తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఐటీ ఉద్యోగుల నిరసనలను అణగద్రొక్కాలని ప్రయత్నించిన కేసీఆర్, తాజాగా తమ పార్టీ నేతలతోనే నిరసనలు చేయిస్తున్నారు.
చంద్రబాబుకు మద్దతుగా బీ.ఆర్.ఎస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఒక రోజు దీక్ష చేస్తూ బాబుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఎట్టి పరిస్థితులలోనూ చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదన్న మోత్కుపల్లి, బాబు అరెస్ట్ జగన్ కు చేటు చేసే అంశంగా మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేసారు. అంతేకాదు, గత ఎన్నికలలో జగన్ ను గెలిపించమని చెప్పి పొరపాటు చేసానని, దానికి క్షమాపణలు చెప్తున్నానని, మరో నాలుగు నెలల్లో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. ఇలా బహిరంగంగా చంద్రబాబుకు తమ పార్టీ నేతల చేత మద్దతు తెలుపుతూనే, మరో వైపు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబును తూర్పార పట్టడం కేసీఆర్ నటనా ప్రావీణ్యతకు అద్దం పడుతోంది. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు అన్నారని, ఇపుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్ అందిస్తామంటున్నారని, బాబు ఫోటోలు వేస్తూ తమ అధికార సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.
సోషల్ మీడియాలో వీటికి పడే కౌంటర్లు ఎలాగూ పడుతుంటాయి, వాటికి కొదవ లేదు. కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు సింపతీని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు కేసీఆర్ చేస్తుండడం ఊహించదగ్గ అంశం కాదు. ఇదే కేసీఆర్ గతంలో చంద్రబాబు ఆడియో టేప్ లీక్స్ అంటూ చేసిన హడావుడి తెలియనిది కాదు. తాజాగా ఆ పార్టీ నేతలే “చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ తప్పు చేయరని” సర్టిఫై చేయడం అనేది… రాజకీయ అవకాశవాదం కాకుండా ఏమి అయ్యుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.



