కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ చాలా ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల కార్యక్రమం నిలిపివేశారు. ఆ కార్యక్రమం నిర్వహించనప్పటికీ సినీ పరిశ్రమ పట్ల కేసీఆర్ ప్రభుత్వం చాలా సాధారంగానే వ్యవహరించింది.
జగన్ సినీ పరిశ్రమని కూడా రాజకీయ కోణంలో నుంచే చూస్తూ దానిపై ద్వేషంతో నంది అవార్డుల కార్యక్రమాన్ని పక్కన పడేయడమే కాకుండా 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు కూడా. కనుక జగన్ ఓటమికి సినీ పరిశ్రమ కూడా ఉడతా భక్తిగా కృషిచేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది.
రాజకీయ కారణాలు, లెక్కలు, ఆలోచనల వలన రెండు రాష్ట్రాలలో నంది అవార్డుల కార్యక్రమం నిలిచిపోయింది. కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీ పెద్దలు సిఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి మళ్ళీ నంది అవార్డుల కార్యక్రమం ప్రారంభించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. .
కానీ నంది అవార్డులకు బదులు ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఏటా డిసెంబర్ 9న ‘గద్దర్ అవార్డులు’ ఇస్తామని చెప్పారు. ఆ ప్రతిపాదన సినీ పెద్దలకు నచ్చిన్నట్లు లేదు అందుకే ఎవరూ ఇంతవరకు స్పందించలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలు అందరూ ఎంతో గౌరవించే కవి, గాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని నేను చెపితే సినీ పెద్దలు ఎందుకు స్పందించలేదో నాకు తెలీదు. కనీసం ఇప్పటికైనా మీ అభిప్రాయం చెపితే ఈ ఏడాది నుంచే గద్దర్ అవార్డుల కార్యక్రమం నిర్వహించడానికి మా ప్రభుత్వం సిద్దంగా ఉంది,” అని సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఓ కార్యక్రమంలో చెప్పారు.
గద్దర్ గొప్ప కవి, ప్రజా గాయకుడు అయినప్పటికీ సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులకు బదులు గద్దర్ పేరిట అవార్డు సినీ పెద్దలకు రుచించిన్నట్లు లేదు.
గద్దర్ సుదీర్గ ప్రస్థానంలో వివిద కారణాల చేత వివిద పార్టీలతో రాజకీయ విభేధాలు, చివరి దశలో చేసిన రాజకీయాలు, ఆయన కుటుంబానికి కాంగ్రెస్‌తో అనుబందం, సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9న గద్దర్ అవార్డుల కార్యక్రమం నిర్వహించాలనుకోవడం వంటి అనేక కారణాల వలన తెలుగు సినీ పెద్దలు స్పందించకపోయి ఉండవచ్చు. కానీ సినీ పెద్దలు ఏ కారణంతో స్పందించనప్పటికీ అది సరికాదు.
సిఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌లాగ అహంభావంతో వ్యవహరించే వ్యక్తి కాదు. అందరితో స్నేహంగా ఉంటూ అందరినీ కలుపుకుపోతుంటారు. కనుక సినీ పెద్దలు ఆయనను కలిసి తమ అభ్యంతరాలు లేదా అభిప్రాయాలు, సూచనలు చెపితే వాటిపై ఆయన సానుకూలంగానే స్పందిచవచ్చు.
కానీ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై సినీ పెద్దలు స్పందించకపోతే ఆయన అహం తింటుంది. ముఖ్యమంత్రికి అసంతృప్తి, అసహనం కలిగితే ఇబ్బంది పడేది సినీ పరిశ్రమే కదా?




