తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి మహాలక్ష్మి పధకం ప్రారంభం అయ్యింది. దీంతో రాష్ట్రంలో మహిళలు ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ, పల్లెవెలుగు, సిటీ బస్సులలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
రోజుకి 12-14 లక్షల మంది మహిళలు టిఎస్‌ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారని అధికారులు అంచనా వేశారు. కనుక టిఎస్‌ఆర్టీసీ ఆ ఆదాయం పూర్తిగా కోల్పోతుంది. అంత భారం టిఎస్‌ఆర్టీసీ భరించేలేదు కనుక ప్రభుత్వమే ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది లేకపోతే టిఎస్‌ఆర్టీసీ దివాళా తీస్తుంది. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించలేదు కనుక పన్నులు, ఛార్జీల పెంచి ప్రజల నుంచే ఆ సొమ్మును రాబట్టుకోక తప్పదు.
ఇక ఈ పధకం ప్రభావం హైదరాబాద్ మెట్రోపై కూడా పడబోతోంది. మెట్రోలో అన్ని మార్గాలలో కలిపి రోజుకి 5 లక్షలకు పైగా ప్రయాణిస్తున్నారు. వారిలో 30-40 శాతం మహిళలు ఉంటారు. ఇప్పుడు సిటీలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు లభిస్తున్నప్పుడు, మెట్రోలో ప్రయాణించి పర్సులు ఖాళీ చేసుకోవడం ఎందుకు?అనుకొంటే మెట్రోకి ‘మహాలక్ష్మి ఎఫెక్ట్’ తప్పదు.
ముఖ్యంగా మెట్రో టికెట్ ఛార్జీలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండటంతో, ఐటి కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు తప్ప మిగిలిన మహిళలు ఉచితంగా లభిస్తున్న బస్సులలోనే ప్రయాణించడం ఖాయం. ముఖ్యంగా విద్యార్ధినులు, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలలో పనిచే మహిళలు, షాపింగ్ కోసం వచ్చేవారు బస్సులలోనే ప్రయాణించవచ్చు. కనుక మెట్రో ప్రయాణికుల సంఖ్య, ఆ మేరకు ఆదాయం కూడా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఇంతకాలం ‘ఇల్లే స్వర్గం’ అనుకొంటూ గుమ్మం దాటి బయటకు రాని మహాలక్ష్ములు కూడా ఇప్పుడు ఇతర జిల్లాలు, ప్రాంతాలలో నివసించే తమ చుట్టాలను పలకరించేందుకు బయలుదేరవచ్చు. పుణ్యక్షేత్రాలు దర్శించుకొనే వెసులుబాటు కూడా లభిస్తోంది కనుక వాటికీ బయలుదేరవచ్చు.
కనుక మహాలక్ష్మి పధకం టిఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో, ఎంఎంటిఎస్, చివరికి షేరింగ్ ఆటోలు, క్యాబ్ సర్వీసులను కూడా ముంచేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ ‘మహాలక్ష్మి తుఫాను ఎఫెక్ట్’ బహుశః ఒకటి రెండు నెలల్లోనే స్పష్టంగా తెలియవచ్చు.




