తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఆంధ్ర పాలకుల ఆధిపత్యం, దోపిడీ ముగుస్తాయని, నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నీ తెలంగాణ ప్రజలకే దక్కుతాయని నాడు కేసీఆర్ పదేపదే చెప్పేవారు.
తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సిఎం అయిన తర్వాత కూడా తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించిందని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.
కానీ శనివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, “తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం లక్ష కోట్లు ఆస్తులు పోగేసుకుంది. వారి కుటుంబ సభ్యులందరూ వందలు, వేల ఎకరాలు పోగేసుకున్నారు. వాటిలో ఫామ్‌హౌసులు నిర్మించుకున్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు, పదవులు, వందల ఎకరాల భూములు, ఫామ్‌హౌసులు… ప్రజలకు ఈ అప్పులు, నిరుద్యోగం, పేదరికం దక్కింది. కానీ వారందరూ కలిసి తెలంగాణ ప్రజల నెత్తిన రూ.8.21 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ తెలంగాణ ప్రజలను దోచుకొని పోగేసుకున్నవే కదా?
కేసీఆర్ హయాంలో పుట్టి పెరిగిన అవినీతి నేటికీ ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడుతూనే ఉంది. ఒక్కొక్కరు వంద నుంచి మూడు, నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారు.
మా ప్రజా ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ నేతలు ఎందుకు కోరుకుంటున్నారంటే మళ్ళీ అందరూ కలిసి తెలంగాణను దోచుకునేందుకే!” అంటూ సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
మరోపక్క కేటీఆర్, హరీష్‌రావు ఇద్దరూ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలే చేస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి నెలకు రెండు, మూడుసార్లు ఢిల్లీ వెళ్ళి తెలంగాణలో దోచుకున్న సొమ్మును మూటలు కట్టి అందించి వస్తున్నారని ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు ఎవరూ వాటిని ఖండించరు. కనీసం స్పందించరు. అంటే ఏమనుకోవాలి?
తెలంగాణ ఏర్పాటు కావడం వలన ఎవరు ఎంత లబ్ధి పొందారో, ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రస్తుత, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు పరస్పరం చేసుకుంటున్న ఈ ఆరోపణలతోనే తేటతెల్లమవుతోంది. రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఎవరెవరు ఎంత దోచుకున్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని ఆస్తులున్నాయో కూడా వారే వివరిస్తుంటారు. కానీ వారి అక్రమాస్తులను జప్తు చేయరు. అవినీతికి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోరు.
కానీ ఆంధ్ర పాలకులు మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి దొడ్డిదారిన వస్తున్నారంటూ ఊహాజనితమైన వాదనలతో ప్రజలను మభ్యపెడుతూనే ఉంటారు.






