రాజకీయ పార్టీలు వేరు.. ప్రభుత్వం వేరు. పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడే ప్రభుత్వం వాటి చేతికి వస్తుంది. లేకుంటే కేవలం ఓ రాజకీయ పార్టీగానే మిగిలిపోతాయి.
కనుక అధికారం దక్కించుకోవడం కోసం ప్రతీ పార్టీ ఎన్నికలలో ఎడాపెడా వరాలు, హామీలు, సంక్షేమ పధకాలు ప్రకటించేస్తుంటాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుపేద యువతుల పెళ్ళి సమయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలలో ఇచ్చే నగదుతో పాటు, తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళవుతున్నా ఈ హామీ నిలబెట్టుకోలేదు.
ఇలాంటి పధకాలతో ప్రజాధనం దుబారా చేయడాన్ని హైకోర్టు తప్పు పడుతూ వాటిపై స్టే విధించింది కూడా. కనుక కొండ నాలుకకి మందేస్తే, ఉన్న నాలుక ఊడినట్లు తులం బంగారం జోడిస్తే రెండు పధకాలు ఎగిరిపోయాయన్న మాట.
ఓ పక్క హైకోర్టులో చివాట్లు తప్పడం లేదు. మరోపక్క వీటిపై బీఆర్ఎస్ పార్టీ అప్పుడే రాజకీయాలు మొదలుపెట్టేసింది.
కేసీఆర్ హయంలో నిరంతరాయంగా అమలు చేసిన ఈ రెండు పధకాలతో పాటు తులం బంగారం ఇవ్వకుండా తప్పించుకునేందుకే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో సకాలంలో కౌంటర్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది.
ఈ పధకాలను అమలు చేయాలని, వాటితో తులం బంగారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హామీని నేడు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
అంటే ఇలాంటి హామీలు పార్టీలను అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడగలవేమో కానీ ఆ తర్వాత ఇలాంటి విమర్శలు, సమస్యలు తెచ్చి పెడతాయన్న మాట!
అయినప్పటికీ ముందు ఏదోలా అధికారంలోకి వస్తే చాలు.. తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని ఎడాపెడా హామీలు ఇచ్చేస్తూనే ఉన్నాయి.
పదవి, అధికారం, పలుకుబడి, అవి తెచ్చే భోగభాగ్యాల ముందు కోర్టు మొట్టికాయలు, ప్రతిపక్షాల విమర్శలు ఓ లెక్కా? కాదని భావిస్తున్నాయి కనుకనే అన్ని పార్టీలు పోటాపోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నాయా?




