కరోనా దెబ్బ తెలంగాణ ఖజానా మీద గట్టిగా పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్ నెలలో కేవలం 400 కోట్ల ఆదాయం వచ్చింది. అసలైతే ప్రభుత్వానికి కేవలం ఒక్క రోజుకే 500 కోట్ల రెవిన్యూ రావాల్సి ఉంది. దాదాపుగా 95 శాతం మేర ఆదాయం నష్టపోయినట్టు అంచనా. మద్యం అమ్మకాల నుండి వచ్చే 1,400 కోట్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే 800 కోట్లు, అలాగే వాహనాల ద్వారా వచ్చే 400 కోట్లు పూర్తిగా సున్నా అయ్యింది.
పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చే 1,500 కోట్ల ఆదాయంలో కేవలం 50 కోట్లు రావడం గమనార్హం. అలాగే జీఎస్టీ నుండి రాష్ట్ర వాటాగా 3,000 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 300-400 కోట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సహజంగా నెలకు 2,500 కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం ఉండగా ఏకంగా 4,000 కోట్లు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇదే సమయంలో రాష్ట్రం ఒక్క ఏప్రిల్ లోనే ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంది. దీనితో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీదే ఆశలన్నీ పెట్టుకుంది. అప్పులు తెచ్చుకునే అవకాశం 3 శాతం నుండి 5 శాతానికి పెంచడం, అదే సమయంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ వైపు చూస్తుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా ఇంతకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు జీతాలు 50% నుండి 75% వరకు ఆపేసింది. లాక్ డౌన్ కొనసాగిస్తే… మే నెల పరిస్థితి మరింత కఠినంగా ఉండబోతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక సంపన్న రాష్ట్రమైన తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.



