ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నారు?

Congress BRS Political Fight

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చాలు.. ప్రజల జీవితాలు బాగుపడతాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ కేసీఆర్‌ దాదాపు పదేళ్ళు ఉద్యమాలు నడిపించారు. ఆ ఉద్యమ సమయంలోనే బీఆర్ఎస్‌ పార్టీ నేతలు భారీగా డబ్బు దండుకున్నారని ఎవరో కాదు కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

సరే! ఉద్యమకాలంలో జరిగిందేదో జరిగింది. తెలంగాణ ఏర్పడింది.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. ఇది నాణేనికి ఒక వైపు కాగా, మరో వైపు చూస్తే ఈ అభివృద్ధి పనుల పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడి వేలకోట్లు వెనకేసుకుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ADVERTISEMENT

శనివారం శాసనసభ సమావేశంలో ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఏమన్నారంటే, “మేము ధరణి పోర్టల్‌ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే 13 వేల ఖాతాలకు 23 లక్షల ఎకరాలు బదిలీ అయినట్లు గుర్తించాము. ధరణిని తవ్వుతున్న కొద్దీ బీఆర్ఎస్‌ నేతల భూదోపిడీ బయటపడుతూనే ఉంది,” అని అన్నారు.

మరో విచిత్రమేమిటంటే, పొంగులేటి కూడా గతంలో బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నారు. అయన కంపెనీకే కేసీఆర్‌ ప్రభుత్వం వేలకోట్ల విలువగల కాంట్రాక్టులు కట్టబెట్టేది. అయన పార్టీ వీడుతున్నప్పుడు “నేను ప్రతీ కాంట్రాక్టులో కేసీఆర్‌కి 5-6 శాతం కమీషన్ చెల్లించేవాడినని స్వయంగా చెప్పుకున్నారు!

ఇప్పుడు కాంగ్రెస్‌ మంత్రులు ప్రతీ పనిలో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని నెలల క్రితం ఓ సభలో మాట్లాడుతూ, మిగిలిన మంత్రులు పై సంతకాలు చేయడానికి కమీషన్ తీసుకుంటారు. కానీ నేను ఆవిధంగా తీసుకోనన్నారు.

దానికి బదులు తన నియోజకవర్గంలో బాలికల హైస్కూల్ భవనం నిర్మించి ఇవ్వాలని కోరారని, సదరు సంస్థ రూ.10 కోట్లతో నిర్మించి ఇచ్చిందన్నారు. అంటే ఆమె సంతకం విలువ పది కోట్లు అన్నమాటే కదా?

ఈ లెక్కన ఒక్కో ప్రభుత్వంలో ఒక్కో మంత్రి ఎన్ని ఫైల్స్‌పై సంతకాలు చేసి ఉంటారు?ఎన్ని వందల కోట్లు సంపాదించి ఉంటారు?

కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మలేమనుకుంటే, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత నిన్నే మరో కొత్త విషయం బయట పెట్టారు. హరీష్‌ రావు సిద్ధిపేట పట్టణంలో 22ఏ నిషేదిత భూములలో వంద ఎకరాలు తన తండ్రి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని, ఆ వివరాలు పంపిస్తానని దమ్ముంటే సిఎం రేవంత్‌ రెడ్డి విచారణ జరిపించి స్వాధీనం చేసుకోవాలని సవాలు విసిరారు.

వేరే జిల్లాలో హరీష్‌ రావుకు మరో 400 ఎకరాలున్నాయని, వాటిలో అయన ఫామ్‌హౌసు నిర్మించుకున్నారని ఇదివరకు ఆమె ఆరోపించారు. అలాగే గంగుల కమలాకర్‌తో సహా పలువురు బీఆర్ఎస్‌ నేతలు భారీగా భూములు సంపాదించుకున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

అయితే ఆమె కూడా తక్కువేమీ తినలేదని, వేలకోట్ల అక్రమాస్తుల పంపకాలలో తేడా రావడం వల్లనే ఆమెను కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు ముగ్గురూ కలిసి బయటకు సాగనంపారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు.

నిన్న శాసనసభలో సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “మాజీ మంత్రి మల్లారెడ్డి పూలు, పాలు అమ్మి అన్నివేల కోట్లు ఎలా సంపాదించారు? అన్ని వందల ఎకరాలు ఎలా కొనగాలిగారు? అన్ని కాలేజీలు ఎలా నిర్మించారు? అని ప్రశ్నించారు.

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తక్కువేమీ తినలేదని, రేవంత్‌ రెడ్డి తన ఇద్దరు సోదరులకు పరిశ్రమల పేరుతో హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో వందలు కోట్లు విలువగల భూములు పంచిపెట్టేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు.

అంతేకాదు… ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెవెన్యూ చట్టంలోని 22ఏని ప్రయోగించి పలు ప్రైవేట్ భూములను నిషేదిత భూముల జాబితాలో చేర్చుతుంటే, కాంగ్రెస్‌ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమీషన్ లేదా వారి ప్రాజెక్టులలో వాటాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఏర్పడితే కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే బాగుపడిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే, కేసీఆర్‌ సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నేతలు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని కేటీఆర్‌ ఆరోపించని రోజు లేదు.

ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే, నాడు బీఆర్ఎస్‌ పార్టీ, నేడు కాంగ్రెస్‌ పార్టీ రెండూ కూడా తెలంగాణ భూములను దోచుకుంటున్నాయని, అలాగే అభివృద్ధి పనుల పేరుతో భారీగా కమీషన్లు దండుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నారు?

ADVERTISEMENT
Latest Stories