ఒక రాష్ట్రం లేదా దేశం అభివృద్ధి చెందితే ఆ ఫలాలు అందరికీ లభిస్తాయి కనుక చాలా సంతోషమే. కానీ అభివృద్ధి మాటున అవినీతి కూడా తప్పదు. అవినీతి అనివార్యమని చెప్పేందుకు తెలంగాణలో కాళేశ్వరం కేసు విచారణ ఓ చక్కటి ఉదాహరణగా కనిపిస్తోంది. కానీ దానిలో అవినీతి జరిగిందా లేదా?అనేది మాత్రం ఎప్పటికీ తేలే విషయం కాదు.
తాజాగా మేడారంలో (సమ్మక సారక్క జాతర) అభివృద్ది పనులకు తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేయగా దానిలో ఇద్దరు సీనియర్ మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్య ఘర్షణ మొదలైంది.
“మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?” అంటూ కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటిపై వారు కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదులు చేస్తూ లేఖలు కూడా వ్రాశారు.
కానీ మంత్రి పొంగులేటి మరో మంత్రి సీతక్కతో కలిసి సోమవారం మేడారంలో పర్యటించినప్పుడు “నేను రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం కక్కుర్తి పడేవాడిని కాను” అన్నారు.
అంటే ఇద్దరు మంత్రులు మేడారం అభివృద్ధి కోసం పోటీలు పడటం లేదని, ఆ టెండర్ల కోసమే పోటీ పడుతున్నారని, అదే వారి వివాదానికి అసలు కారణమని స్పష్టమవుతోంది.
ఇది వరకు వరంగల్‌లో ఓ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, “చాలా మంది మంత్రులు ఫైల్స్ పై సంతకాలు చేసేందుకు డబ్బులు తీసుకుంటారు. కానీ నేను అటువంటి దానిని కాను. నా నియోజకవర్గంలో పిల్లలకు ఓ స్కూల్ భవనం కట్టించి ఇవ్వమని అడిగాను.
ఆ కంపెనీ వాళ్ళు రూ.10 కోట్లతో నిర్మించి ఇచ్చారు,” అని చెప్పారు. అంటే ఆమె ఒక్క సంతకానికి విలువ రూ.10 కోట్లన్న మాట!ఇప్పుడు ఆమె, మంత్రి పొంగులేటితో టెండర్ల విషయంలో గొడవపడుతున్నారు. అంటే అర్దమేమిటి?
గతంలో పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. అప్పుడు ఆయన కంపెనీలకు అనేక వేల కోట్ల విలువగల కాంట్రాక్టులు లభించేవి. తెలంగాణ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తలో తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ప్రతీ కాంట్రాక్టు విలువను బట్టి 5-6 శాతం కమీషన్ చెల్లిస్తుండేవాడినని కుండబద్దలు కొట్టారు!
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు దండుకునేదని కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపించేది. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు దండుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుండటం అందరూ వినే ఉంటారు.
కనుక పార్టీలు, ప్రభుత్వాలు మారినా అభివృద్ధి-అవినీతి అవిభక్త కవలలని ఎవరూ విడదీయలేరని స్పష్టమవుతోంది కదా?







