కవిత అరెస్ట్ పై రాజకీయ పార్టీల స్పందన..!

telangana political parties

కవిత అరెస్టు పై ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న పార్టీల గొంతు నొక్కడానికి బీజేపీ ఇటువంటి నీచరాజకీయాలకు పాల్పడుతుంది అంటూ మండిపడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నేతలు.

కేసులతో రెచ్చకొట్టడం..,అరెస్టులతో బెదిరించడం బీజేపీ వక్రబుద్ధిని బయటపెడుతోంది. ఇటువంటి పిట్ట బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదు అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈడీ కవితను అరెస్టు చేయడం అన్యాయం, దీని పై చట్ట పరంగా పోరాటం చేస్తాం అంటూ బీజేపీ పై ఫైర్ అయ్యారు వేముల.

ADVERTISEMENT

అలాగే అన్న కేటీఆర్ స్పందిస్తూ…విచారణలో ఉన్న కేసులో అరెస్టు చేయబోము అంటూ సుప్రీం కోర్టులో చెప్పి ఇప్పుడు శని, ఆదివారాలు కోర్టులకు సెలవు దినాలు కాబట్టి శుక్రవారం వచ్చి అరెస్టు చేయడం అంతా ప్రణాళిక ప్రకారం జరిగిందంటూ ఈడీ అధికారుల పై ఆరోపణలు చేసారు. ఇలా సొంత పార్టీ నుండి బీజేపీ పై విమర్శలు, కవితకు మద్దతు దక్కుతున్న వేళ రాష్ట్ర బీజేపీ స్పందన ఇలా ఉంది.

అసలు తప్పు చేయనప్పుడు విచారణకు హాజరుకాకుండా, అధికారులకు సహకరించకుండా ఇన్నాళ్లుగా కవిత ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు..? నేరం చేయనప్పుడు ఐటీ, ఈడీ సోదాల పై గగ్గోలు పెట్టవలసిన అవసరం ఏముంది..? ఈడీ అధికారులు చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే కవిత మీద పెట్టిన కేసులు మాఫీ అయిపోతాయి. దానికెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం..? దాని పై ఆరోపణలు చేయడం..? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కవిత ఇంట్లో జరిగిన సోదాలు, కవిత అరెస్టుకు కేంద్ర ప్రభుత్వానికి కానీ బీజేపీ కి కానీ ఎటువంటి సంబంధం లేదు అంటూ చేతులు దులుపుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వైఖరి మరోలా ఉంది. కవిత ఇంట్లో ఈడీ అధికారులు చేపట్టిన సోదాలు బీజేపీ – బిఆర్ఎస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమే అంటూ కాంగ్రెస్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

త్వరలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు గల్లీలో కొట్టుకున్నట్టు నటించి ఢిల్లీలో ఏకమవుతారు. తెలంగాణ ప్రజలకు మేమిద్దరం ఒకటికాదు అని నిరూపించడంలో భాగంగానే బీజేపీ ఇటువంటి కుట్ర రాజకీయాలకు తెరలేపింది. నిజంగా వీరి మధ్య ఏ సంబంధం లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టైన మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన్పపుడే కవితను కూడా అరెస్టు చేసి ఉండాలి గా అంటూ బీజేపీ, బిఆర్ఎస్ లను నమ్మొద్దు అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కోమటిరెడ్డి.

ఇలా కవిత అరెస్టు పై ఒక్కో పార్టీ ఒక్కో రకంగా స్పందిస్తున్నప్పటికీ…ఈ తెలంగాణ రాజకీయలలో మొదలైన ప్రకంపనలు ఏపీని తాకనున్నాయా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇదే లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న శరత్ చంద్రా రెడ్డి….ఏపీ ప్రభుత్వంలో, వైసీపీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయి రెడ్డి బంధువు కావడంతో వైసీపీ కక్కలేక మింగలేక ఆపసోపాలు పడుతుంది.

ADVERTISEMENT
Latest Stories