తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత కేంద్ర ప్రభుత్వం భన్వర్ లాల్ ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ, తెలంగాణకు ఇన్ చార్జ్ గా నియమించింది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలకూ విధులు నిర్వహిస్తున్నారు భన్వర్. ఏదైనా విధుల్లో ఉన్న అధికారికి, అదనపు బాధ్యతలు అప్పగిస్తే, వేతనంలో 20 శాతాన్ని ఇన్ చార్జ్ అలవెన్స్ రూపంలో సదరు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
భన్వర్ లాల్ వేతనం నెలకు 2.25 లక్షలు కాగా, తెలంగాణ సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నెలకు 45 వేలు చెల్లించాల్సి వుంటుంది. అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో, ఆ మొత్తం ప్రస్తుతం 16 లక్షలకు పెరిగింది. తన ఇన్ చార్జ్ అలవెన్స్ చెల్లించాలని భన్వర్ లాల్ లేఖ రాయగా, తెలంగాణ ఉద్యోగి కాదని, తమ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి కాని వారికి తాము అలవెన్స్ లు ఇవ్వలేమని కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసింది.


