తెలంగాణ రాజకీయం ఆంధ్రాకు ఆదర్శమే…

Comparison of Telangana’s united political strategy with Andhra Pradesh’s divided leadership and ongoing internal political conflicts.

అవును తెలంగాణ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఇక్కడి రాజకీయ పార్టీలకు ఆయా పార్టీల నాయకులకు చాల అంశాలలో ఆదర్శంగా నిలుస్తుంది. ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విషయంలో చూసుకుంటే ఈ ఒక్క నినాదం అటు అధికార పక్షాన్ని ఇటు ప్రతిపక్షాన్ని అలాగే తెలంగాణ సాధన కోసం కొట్లాడుతున్న ప్రతి ఒక్క సామాన్యుడిని ఏకం చేసింది.

అలాగే ఆ లక్ష్య సాధన దిశగా అందరిని కలిపి అడుగులు వేసేలా చేసింది, చివరికి కోరుకున్న లక్ష్యాన్ని సాధించుకునేలా కలిసికట్టుగా పోరాడింది. దాని కోసం రాజకీయ నాయకులు తమ పదవులను త్యాగం చేస్తే, సామాన్య యువత తమ ప్రాణాలను బలి చేసుకున్నారు.

ADVERTISEMENT

అయితే ఈ ఉద్యమ లక్ష్యం అల్టిమేట్ గా రాజకీయ లబ్దే అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి మరి ఒకరి నాయకత్వంలో అందరు కలిసి నడవడం అనేది, ఒకరు ఇచ్చే నినాదాలను అందరు చిత్తశుద్దిగా ఆచరించడం అనేది నిజంగా హర్షణీయం.

అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఈ ఉమ్మడి కార్యాచరణ అనేది బూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కనిపించదు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ నిందించినప్పటికీ ఆ నినాదాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడే ఏపీకి కరువయ్యాడు. ఆ లోటు ఆంధ్రప్రదేశ్ ని ఈ స్థితికి పట్టుకొచ్చింది.

ఇక నాడు విభజన సమయంలో సైతం ఏపీ భవిష్యత్ కి ఎం కావాలి.? విభజన గాయం నుంచి హైద్రాబాద్ లోటు నుంచి ఏపీ తిరిగి ఆర్థికంగా పుంజుకోవడానికి ఎంత సాయం ఇవ్వాలి.? అంటూ కేంద్రాన్ని నిలదీయగలిగిన ఒక్క నాయకుడు కూడా ఏపీ కి లేకపోవడం ఇప్పటికి ఏపీని ఆర్థికంగా బాధిస్తూనే ఉంది.

అలాగే విభజన హామీల అమలు విషయంలో కానీ ప్రత్యేక హోదా, వైజాక్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంలో కానీ, పోలవరం పూర్తి చేయడం మీద, రాజధాని అమరావతి అభివృద్ధి మీద కానీ కేంద్రంతో కలిసికట్టుగా పోరాడేందుకు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకు రావు రాలేవు.

ఇక్కడ ఒకరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించినా, కేంద్రంతో కొట్లాడినా అందుకు మరో రాజకీయ పార్టీ కేంద్రానికి మద్దతుగా నిలుస్తుంది. వారితో తెరచాటు రాజకీయ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇక్కడ పోయిన బంధాన్ని అక్కడ కొనసాగించాలని తాపత్రయ పడుతుంది తప్ప, దాని ఫలితంగా రాష్ట్రం కకావికలమవుతుంది అనే ఆలోచన చెయ్యదు.

అంతెందుకు తాజాగా బనకచర్ల విషయానికొస్తే తెలంగాణ నుంచి వృధాగా సముద్రంలో కలిసే నీటిని ఏపీ ప్రభుత్వం బంకచర్ల ప్రాజెక్ట్ గా నిర్మిస్తుంటే అది తెలంగాణ ప్రయోజాలను దెబ్బ తీస్తుంది అంటూ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాయి.

మరి ఇక్కడ ఏపీలో ఒక్క టీడీపీ పార్టీ తప్ప మరొకరు తెలంగాణ నాయకుల ఆరోపణలకు ఖండించలేదు, వారికీ కౌంటర్ ఇవ్వలేదు. తెలంగాణ నుంచి వృధా గా సముద్రంలో కలిసే నీటి కోసమే వారు అంతలా ఏకమైతే ఇక్కడ ఆ నీటి వలన ఏంతో మంది రైతులకు సాగు నీరు ఎన్నో ప్రాంతాల వారికి తాగు నీరు లభిస్తుంది.

మరి అటువంటి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్ష వైసీపీ కాదు కాదా కనీసం కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన, బీజేపీ కూడా ఏపీకి మద్దతుగా నిలవలేదు. ఇక వైసీపీ అయితే శవ రాజకీయాల మీద పెట్టె శ్రద్ధలో కాస్తయినా ఈ ప్రాజెక్ట్ ను కాపాడుకోవడం మీద పెట్టలేకపోయింది.

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం ఇంతలా న్యాయపోరాటాలు చేస్తున్న వైస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం తెలంగాణ నేతల ఆరోపణల మీద ఒక్కసారి కూడా స్పందించలేదు, తమ రాష్ట్ర ప్రయోజనాలా కొరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు.

ఇక ఇప్పుడు తెలంగాణలో మొదలైన బీసీ రిజర్వేషన్ల రచ్చకు సైతం అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఇలా తెలంగాణ రాజకీయం తెలంగాణకు, అక్కడి ప్రజలకు ఎంతోకొంత రాజకీయ ప్రయోజాలను అందిస్తుంది, రాష్ట్ర ప్రగతిని సాధిస్తుంది.

ఇక ఏపీలో అధికార – ప్రతిపక్షాల మధ్య జరిగే రాజకీయంలో ఏకంగా రాష్ట్ర రాజధాని సైతం సమాధి అవ్వడానికి సిద్దమయ్యింది, ఐదేళ్లపాటు అరణ్యరోదన చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, అక్కడి ప్రజల కోసం తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతుంటే ఇక్కడ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విచ్ఛిన్నం చేయడానికి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఎదగనీయకుండా చేయడానికి ప్రతిపక్షం నిత్యం రాష్ట్ర ప్రభుత్వంతో రప్ప రప్ప అంటూ రాజకీయ యుద్ధమే చేస్తుంది.

ADVERTISEMENT
Latest Stories