తెలుగు సినిమాలకు కరోనాలా… ఇంగ్లీష్ వైరస్!

Telugu cinema embracing English titles and pan-India identity

తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెడితే దానిలో ‘పంచ్’ ఉండదంటారు. కనుక ఇంగ్లీషు పేర్లు పెట్టుకుంటారు. అలాగే ఆ సినిమాలలో పాటలు తెలుగులో ఉండాలనుకోవడం ఈరోజుల్లో అత్యాసే అవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు కుదిరితే నాలుగు తమిళ్ లేదా మలయాళం లేదా విదేశీ ముక్కలు కూడా వేస్తారు.

కనుక అన్ని భాషలపై ఎంతో కొంత పట్టు ఉంటే తప్ప ‘తెలుగు పాట’ని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే. మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో దాచి ఉంచినట్లు ఈ రెండు మూడు భాషల పాటని చెవులు చిల్లులు పడే సంగీతంలో దాచి పెట్టి వినిపిస్తారు.

ADVERTISEMENT

కనుక ఆ పాటని వెతికి పట్టుకోవడం కూడా పెద్ద పరీక్షే. ఈ పరీక్షలో నెగ్గితేనే ఆ పాట చెవులకి అక్కడి నుంచి మెదడుకి చేరి రైటో తప్పో అర్ధమవుతుంది.

అందుకు పాటలు వ్రాసేవారినో లేదా ఆ పాటలకి సంగీతం మోత మ్రోగించేవారినో లేదా ఆ పాటలని సినిమాలో పెట్టిన గొప్ప అభిరుచి కలిగిన దర్శక నిర్మాతలను వేలెత్తి చూపడం చాలా తప్పు. వాటిని అర్ధం చేసుకోలేని స్థాయిలో ఉన్నవారిదే తప్పు.

సరే! సినిమా పేరు, పాటలు, డైలాగులలో ‘పంచ్’ ఉండాలి గాబట్టి ఇంగ్లీషు దట్టించుకున్నా సినిమా పూజా కార్యక్రమం మొదలు విడుదలయ్యే వరకు అన్నీ ఇంగ్లీషులోనే చెపుకుంటాము. షూటింగ్, ఫస్ట్ షెడ్యూల్, ఫస్ట్ పోస్టర్‌, ఫస్ట్ గ్లిమ్స్‌, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, టీజర్‌, ట్రైలర్‌, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌, డిజిటల్ రైట్స్, ప్రీమియర్స్, ఓటీటీ, సక్సస్ మీట్… అన్నీ ఇంగ్లీషులోనే చెప్పుకోవడం తెలుగువారిమైన మనందరికీ ఎంతో గర్వకారణం.

ఆ గర్వాన్ని, తెలుగువారి గొప్పదనానికి కొనసాగింపుగా సినీ కార్యక్రమాలలో వేదికపై ఉన్న దర్శక నిర్మాతలతో సహా అందరూ ఇంగ్లీషులోనే చాలా హుందాగానే మాట్లాడుతుంటే అభిమానులు చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేస్తుంటారు.

తాజాగా తెలుగు సినిమాలకు ‘పాన్ ఇండియా లేబుల్’ తప్పనిసరైంది. కనుక అన్ని రాష్ట్రాల నుంచి చెరో నటుడిని తెచ్చుకొని, తెలుగు సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసుకొని చూసి ఆనందిస్తున్నాము.

ఈ మార్పులు అర్ధం చేసుకోలేని లేదా జీర్ణించుకోలేని ముందు తరంవారు ఇలాగే ఏదేదో అంటుంటారు. వాటన్నిటినీ పట్టించుకోకూడదు. కుంటే పాన్ వరల్డ్ స్థాయికి ఎగదనీయరు!

ADVERTISEMENT
Latest Stories