jagan_chandrababu_naidu_

విభజన గాయంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ గాయం మానక మునుపే గత ప్రభుత్వ పెద్దల పాలనారాహిత్యం ఆగాయాలను మరింత పెద్దవి చేసాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీ భవిష్యత్ ను మూడు తరాలు వెనక్కి నెట్టింది.

Also Read – జగన్‌తో సహవాసం.. ముగింపు ఇలాగే!

జగన్ నియంత పోకడలను ఎదుర్కోలేక, వైసీపీ కక్ష్య పూరిత రాజకీయాలను తట్టుకోలేక గత సర్కార్ హయాంలో పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు సీతకన్నేసారు. గత ఐదేళ్లుగా ఏపీ సరిహద్దులు దాటిపోయి సంస్థలే కానీ ఏపీ లోకి అడుగుపెట్టే సంస్థలే కానరాలేదు. పెట్టుబడులు రాక అభివృద్ధి లేక రాష్ట్రం పురోగమనం దిశగా ఒక్కో అడుగు దిగజారుతూ పోయింది.

జగన్ ముర్కత్వం, వైసీపీ నేతల దౌర్జన్యం, మంత్రుల బాధ్యతా రాహిత్యం అన్ని కలగలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మానని గాయాలే చేసాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో వైసీపీ దాష్టికాలకు ఇక చరమ గీతం పాడినట్టే అన్న ఉద్దేశంతో, బాబు నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు కన్నేశారు.

Also Read – జగన్ అనుకున్నట్టే బట్టలు ఊడతీస్తున్నారుగా…

దీనితో ఇన్నాళ్ళుగా ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలకు ఊపిరొచ్చింది. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభసూచికనే చెప్పాలి. సత్యవేడులోని శ్రీసిటీ లో ముఖ్యమంత్రి బాబు పర్యటనలో భాగంగా ఒకేసారి 15 పరిశ్రమల ప్రారంభోత్సవం, 7 పరిశ్రమల శంకుస్థాపన చేయనున్నారు.

దీనితో రాష్ట్రానికి 900 కోట్లు పెట్టుబడులు 2740 మందికి ఉపాధి లభిస్తుంది. దీనితో పాటుగా మరో 1213 కోట్ల పెట్టుబడులకు కూటమి ప్రభుత్వం ఆయా సంస్థల తో ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేయనుంది. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ అప్పుల కోసం వేట మొదలుపెడితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటి ముఖ్యమంత్రి బాబు ఆదాయం కోసం వేట కొనసాగిస్తున్నారు.

Also Read – పవన్ పై కేటీఆర్ వ్యాఖ్యలు…!

ఒక విజనరీ పాలనకు, ఒక ప్రిజనరీ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపు స్పష్టంగా చూపించారు బాబు. అప్పులతో కాకుండా ఆదాయ సృష్టితో అభివృద్ధి చేయడం, రాజకీయ కక్ష్య సాధింపులు కాకుండా రాజ్యాంగ బద్దమైన చర్యలు చేపట్టడం, కూల్చివేతలకు సమాధి కట్టి, కట్టడాలకు పునాదులు వేయడం బాబు బాధ్యతాయుత పాలనకు అద్దం పడుతుంది.

అధికార అహంతో రాష్ట్రానికి గత పాలకులు చేసిన ‘గాయాలకు’ తన అనుభవంతో, తన విజనరీతో, పాలన మీద తనకున్న పట్టుతో ‘న్యాయం’ చేస్తున్నారు బాబు. పారిశ్రామిక వేత్తలకు తన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలకు ప్రోత్సాహకాలిచ్చి ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడానికి బాబు చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయం.

ఇప్పటికే బీపీసీఎల్ సంస్థ ఏపీలో 70 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. అలాగే టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ చర్చలు జరిపి ఏపీలో పెట్టుబడులకు తగిన అవకాశాలను వివరించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరు క్షణమే అమరావతి పై వచ్చిన అపోహలు తొలిగిపోయి ఏపీ రాజధానిగా అమరావతి పేరు సుస్థిరమయ్యింది. ఇన్నాళ్ళుగా ఏపీకి రాజధాని లేదు అన్న ‘గాయాని’కి కూటమి ప్రభుత్వం సత్వర ‘న్యాయం’ చేసింది.

గుడ్డుకేం తెలుస్తుంది కోడి కష్టం అన్నట్లుగా వైసీపీ నేతలకేం పడుతుంది కూటమి ప్రభుత్వం తాలూకా కష్టాలు. గత ప్రభుత్వం రాష్ట్రం మీద వేసిన నీలి నిందలు చెరిపి, ఇప్పుడు ప్రభుత్వం మీద వైసీపీ వేస్తున్న రక్తపు మరకలను కడిగి, పొరుగు రాష్ట్రాలతో పోటీ పడి పారిశ్రామిక వేత్తలను ఒప్పించి ఇన్ని సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం అంటే మీడియా బూతులు తిట్టినంత సులువు కాదని వైసీపీ నేతలు ఎప్పటికి గ్రహించలేరు.