ఇంకా గేమ్ మొదలవనే లేదు… అప్పుడే కొడాలి నాని ఆక్రందనలా?

kodali-nani-on-attacks

ఏపీలో 2019లో జగన్‌ పాలన మొదలైనప్పటి నుంచి ఎన్నికల గంట మ్రోగే వరకు కూడా టిడిపి ముఖ్య నేతలపై కేసులు, వేధింపులు సాగాయి. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి రాష్ట్రంలో టిడిపిని తుడిచిపెట్టేయాలని జగన్‌ ప్రయత్నించారు కూడా.

టిడిపి కార్యాలయాలు, కార్యకర్తలపై వైసీపి గూండాలు విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారు. ఆ దాడులలో అనేకమంది టిడిపి కార్యకర్తలు చనిపోయారు కూడా. గుంటూరు, పల్నాడు, అనంతపురం, చిత్తూరు వంటి కొన్ని జిల్లాలలో వైసీపి దాడులకు భయపడి టిడిపి మద్దతుదారులు ఊర్లు వదిలివెళ్ళిపోయారు కూడా.

ADVERTISEMENT

జగన్‌ ప్రభుత్వం టిడిపిపై ఎంతగా పగబట్టిందంటే హైదరాబాద్‌లో ఉంటున్న మాజీ మంత్రి నారాయణ, చింతకాయల రాజేష్ వంటివారిని కూడా విడిచిపెట్టలేదు. వారిని వెంటాడి వేటాడి ఏపీకి తీసుకువచ్చి వేధించింది.

ఐదేళ్ళ పాటు ఓ మహా యజ్ఞంలా ఈ దాడులు, వేధింపులు జరిపిన వైసీపి ఇప్పుడు టిడిపి కార్యకర్తలు తమపై దాడులు చేయడం అక్రమం, అన్యాయమని రాష్ట్రంలో ప్రభుత్వం, రాజ్యాంగం అనేవి ఉన్నాయా లేవా?అని ప్రశ్నిస్తున్నారు.

కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, “మాపై టిడిపి మూకలు దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ విఫలమైంది. కనుక మేము ఈ సాక్ష్యాధారాలతో హైకోర్టులో కేసులు వేసి న్యాయపోరాటం చేయబోతున్నాము.

టిడిపి దాడుల నుంచి వైసీపి కార్యకర్తలను కాపాడుకోవాలని జగన్‌ ఆదేశించారు. కనుక ఒకటి రెండు రోజులలో మేమందరం కూడా రోడ్లపైకి వచ్చి టిడిపి మూకలను ఎదుర్కొంటాము. దాని వలన శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే దానికి పోలీస్ వ్యవస్తే బాధ్యత వహించాల్సి ఉంటుంది,” అని హెచ్చరించారు.

ఇంతకాలం తాము టిడిపి, జనసేనలను వేధిస్తున్నప్పుడు కొడాలి నానికి తప్పుగా అనిపించలేదు. పైగా వారి ఆక్రందనలు చూసి పైశాచిక ఆనందం అనుభవించేవారు. కానీ ఇప్పుడు అదే తమకు జరుగుతుంటే తప్పుగా కనిపిస్తోంది.

ఇంతకాలం పోలీసులు తమ కనుసన్నలలో పనిచేస్తూ టిడిపి నేతలు, కార్యకర్తలను వేధించినప్పుడు కొడాలి నానికి పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తున్నట్లు భావించారు. కానీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ విఫలమైందని తేల్చేశారు.

అసలు తమపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారో కొడాలి నాని అర్దం చేసుకున్నట్లు లేదు. వారు కూడా జగన్, వైసీపి బాధితులే కదా?

ఇంతకాలం కోర్టులు తమ ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టినా, తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా జగన్‌ ప్రభుత్వం మండిపడుతూ హైకోర్టు, న్యాయమూర్తులు, న్యాయవస్థని విమర్శించేది. కానీ ఇప్పుడు అదే హైకోర్టు, అదే న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ తమని ఆదుకోవాలని కొడాలి నాని ఆశిస్తున్నారు!

జగన్‌ మాటలు నమ్మి ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటామనుకోవడం ఒక పొరపాటు అయితే, ఆ భ్రమలో అరాచకాలకు పాల్పడటం ఇంకా పెద్ద పొరపాటు. వాటికే వైసీపి నేతలు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. 2014 ఎన్నికలలో టిడిపి గెలిచి అధికారంలోకి వచ్చినపుడు ఈవిదంగా జరుగలేదు కదా? కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అని ఆలోచిస్తే ఇవన్నీ మనం సృష్టించుకున్న సమస్యలే అని వైసీపి నేతలకు అర్దమవుతుంది.

అయితే ఇలాంటి అరాచకాలను చంద్రబాబు నాయుడు సహించరు. పార్టీలో ఎవరూ విచ్చలవిడిగా ప్రవరించవద్దని, ప్రవర్తిస్తే ఉపేక్షించనని అందరికీ గట్టిగా హెచ్చరించారు.

కానీ వైసీపి నేతలందరూ రోడ్లపైకి వచ్చి టిడిపి శ్రేణులపై దాడులు చేయమని తమ అధినేత జగన్‌ ఆదేశించారని కొడాలి నాని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్‌ రెడ్డికి ఉండే తేడా ఇదే!

ADVERTISEMENT
Latest Stories