సినిమా బాగుంటే భాషతో నిమిత్తం లేకుండా ఆదరించడం ఇండియన్ సినీ ప్రేమికులకు ప్రీతిపాత్రమైన విషయం. అందుకే ప్రముఖ హాలీవుడ్ సినిమాలన్నీ ఇండియాలోని వివిధ భాషల్లో విడుదలై కోట్లు కొల్లగొడుతున్నాయి. ఆ క్రమంలోనే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన “ది జంగిల్ బుక్” సినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా నేటితో దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకుంది.
ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హాలీవుడ్ సినిమాల జాబితాలో గత రికార్డులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిల్చుంది ఈ సినిమా. అంతేకాదు, ఈ ఏడాది ఇండియన్ సినిమాల కలెక్షన్స్ ను మించిపోయే రేంజ్ లో బాక్సాఫీస్ ను ఈ ‘బుడ్డోడు’ అల్లాల్లాడించాడు. ‘ది జంగిల్ బుక్’ విడుదలైన సమయంలో రిలీజ్ చేసిన బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలన్నీ చతికిలపడడంతో మొత్తం రికార్డులన్నీ తన వశం చేసుకున్నాడు.
దాదాపు 200 కోట్ల మార్క్ ను అతి చేరువగా వచ్చిన ఈ సినిమా స్ఫూర్తిని తీసుకుని విడుదలైన, అనేక హాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి గానీ, ఈ సినిమా మాత్రం ఇప్పటికీ ఏదొక ధియేటర్లో సందడి చేస్తూనే ఉంది. వినోదాత్మకమైన కధాబలంతో పాటు కన్నుల విందైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ ధియేటర్లకు రప్పించేలా చేసింది.



