చిత్రం: ప్యారడైజ్
M9 రేటింగ్: 1.75/5
విడుదల తేదీ: సెప్టెంబర్ 24, 2026
తారాగణం: నాని, మోహన్ బాబు, కయాడు లోహార్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
ఛాయాగ్రహణం: సీహెచ్ సాయి
కూర్పు: నవీన్ నూలి
మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం నాని చేసిన మరో ప్రయత్నం “ప్యారడైజ్”. దసరాతో మంచి హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల అనంతరం కనీసం ట్రైలర్ కూడా లేకుండా నేడు (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోనేషన్ మరోమారు ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ:
1945లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా.. అదే స్వాతంత్ర్యం కోసం గాంధీతో కలిసి పోరాడిన సవారీ తెగకి మాత్రం కనీసం మనుషులుగా, భారత పౌరులుగా గుర్తింపు రాదు. షికాంజి మాలిక్ (మోహన్ బాబు) పైశాచిక పాలనలో కనీసం అన్నం గింజకి దిక్కు లేకుండా బ్రతుకుతూ ఉంటారు సవారీలు. ఆ గుర్తింపు కోసం సాగే యుద్ధానికి వారసుడిగా, నాయకుడిగా అడుగుపెడతాడు జడల్ (నాని).
జడల్ వెర్సెస్ మాలిక్ & మాలిక్ కొడుకు పోరు ఎలా సాగింది? ఈ పోరులో సవారీలు ఎదుర్కొన్న సమస్యలేమిటి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? గుర్తింపు సంపాదించుకున్నారా? వంటి ప్రశ్నలకు సమాధానమే “ది ప్యారడైజ్” చిత్రం.
నటీనటుల పనితీరు:
నాని కష్టపడ్డాడు అని కనిపిస్తుంటుంది కానీ.. ఆ కష్టం ఎందుకు? అంతలా ఏముంది కష్టపడడానికి అనిపిస్తుంటుంది. యాక్షన్, ఎమోషన్ వంటివి పుష్కలంగా ఉన్నా.. సరైన క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడంతో జడలు వేసుకుని నాని పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ & విలనిజం అదిరిపోయినప్పటికీ.. ఆయన విలక్షణ నటన కూడా సరైన డెప్ట్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబుల పరిస్థితి కూడా ఇంతే. పాపం ఈమాత్రం దానికా ఇన్నేళ్ల పాటు కష్టపడ్డారు అనిపించకమానదు.
ఇక కయాడు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తాను ఈ సినిమాలో తన పాత్రలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారోనని భయపడుతున్నానని చెబుతుంది. అందుకు కారణం సినిమా చూసాక అర్ధమవుతుంది. ఆమె పాత్ర సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా తల్లితో “సింగిల్ టేక్ ఆర్టిస్టువి” అని చెప్పించే డైలాగ్ & సీన్ చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఈ సినిమా ఆమె కెరీర్ కి మైనస్ గా మారడం ఖాయం. రాఘవ్ జుయాల్ ఉన్నాడు కానీ.. అతడి పాత్రలో పస లేదు. ఓ రెండు స్లో మోషన్ షాట్స్ లో పర్వాలేదనిపించుకున్నాడు అంతే.
సాంకేతికవర్గం పనితీరు:
నవీన్ నూలి మీద మొదటిసారి జాలి వేసింది. అసలు శ్రీకాంత్ ఓదెల ఏం ఫూటేజ్ ఇచ్చాడు? అది నవీన్ కి ఏం అర్థమైంది? దాన్ని ఒక సినిమాగా ఎలా ఎడిట్ చేశాడు? అనేది అర్థం చేసుకోగలిగితే.. అతడికి సెల్యూట్ చేస్తాం. అంత కష్టపడాల్సిన కంటెంట్ ఇది.
అనిరుధ్ కి కంటెంట్ ఇవ్వడం లేట్ చేసినట్లున్నారు.. దాంతో రిపీటెడ్ బీజేయంతో స్వాహా అనిపించాడు తప్పితే.. సినిమాలో సపరేట్ గా ఒక్కటంటే ఒక్క మ్యూజిక్ ట్రాక్ కూడా పేలలేదు. ఉన్న రెండు పాటల్లో ఏశునాగుల పాట ప్లేస్మెంట్ అయితే మరీ చిరాగ్గా ఉంది. ఆయా షేర్ మాత్రం బాగానే వర్కవుట్ అయ్యింది.
సీహెచ్ సాయి సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం బాగుంది. లైటింగ్, ఫ్రేమ్స్ తో సినిమా మీద ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా నైట్ షాట్స్ లో లైట్ బ్యాలెన్స్ చేసిన విధానం బాగుంది.
ఆర్ట్ & ప్రొడక్షన్ డిజైన్ టీమ్ కష్టాన్ని కచ్చితంగా మెచ్చుకోవాలి. 1980 కాలాన్ని పెద్దగా రీక్రియేట్ చేయలేదు కానీ.. సెట్ వర్క్ లో ఆ బురద, గుడిసెలు, డంప్ యార్డ్ వంటివి నేచురల్ గా ఉన్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దగ్గర బోలెడు ఐడియాలు ఉన్నాయి కానీ.. వాటిని తెరపై చూపించే ప్రయత్నంలోనే అసలు లోపం. కేవలం ఒక పాయింట్ అనుకొని, క్లైమాక్స్ లేకుండా, కథనం లేకుండా షూటింగ్ మొదలుపెట్టడం పెద్ద మైనస్. అందువల్ల.. సినిమా గోల్ ఏంటి? ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంది? అనేది అర్థం కాదు. గుర్తింపు కోసం పోరాటం ఎక్కడపడితే అక్కడ బోలెడన్ని యూటర్న్ లు తీసుకొని చివరికి ఇటు వెళ్లిందో ఆడియన్స్ కు సైతం అర్థం కాక చతికిలపడుతుంది.
నాని, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, కయాడు, సంపూర్ణేష్ బాబు వంటి నటుల్ని పెట్టుకుని, ఒక్కరి పాత్రకి కూడా క్యారెక్టర్ ఆర్క్ రాసుకోకపోవడం, ఒక్క సీన్ కి కూడా కంటిన్యూటీ లేకపోవడం, సీన్ టూ సీన్ ట్రాన్సిషన్ కోసం బేసిక్ షాట్స్ కూడా ప్లాన్ చేసుకోకపోవడం అనేది దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల ఫెయిల్డ్ ప్లానింగ్ కి నిదర్శనం. మోహన్ బాబు క్యారెక్టర్ ఇంట్రడక్షన్, సినిమా ఓపెనింగ్ లో వచ్చే ప్రసవం ఎపిసోడ్ లో తప్ప శ్రీకాంత్ ఓదెల మార్క్ ఎక్కడా కనిపించలేదు.
ఇక యాక్షన్ సీన్స్ ని చాలా వైల్డ్ గా తీయాలి అనే అత్యుత్సాహంతో “మార్కో”నీ మించిన హింసను యాక్షన్ బ్లాక్స్ & సినిమాలో ఇరికించిన విధానం పైత్యంలా ఉంటుంది తప్పితే.. ఆ హింసను జస్టిఫై చేసే ఎమోషన్ కానీ ఇంటెన్సిటీ కానీ కనిపించవు. ఇక సీన్స్ సరిగ్గా రాసుకోకుండా చాప్టర్స్ అంటూ కనెక్టివిటీని ఇష్యూస్ ని కవర్ చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. ఓవరాల్ గా.. నాని కెరీర్ లోనే ఒక అవుట్ రైట్ బ్యాడ్ ఫిలింగా “ప్యారడైజ్” సినిమాని నిల్చోపెట్టి.. తాను మాత్రం పాతాళంలో పాతుకుపోయాడు శ్రీకాంత్ ఓదెల. ఒక దర్శకుడిగా, వ్యక్తిగా ప్యారడైజ్ అనే సినిమా శ్రీకాంత్ కెరీర్ కి ఒక సమాధి లాంటిది. మరి దాన్నుండి బయటపడడానికి శ్రీకాంత్ కి ఎంత టైమ్ పడుతుందో చూడాలి.
విశ్లేషణ:
నీ సినిమా గోల్ ఏంటి? ఆ గోల్ ని రీచ్ అయ్యే విధానం ఏంటి? ఆ విధానం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా? లేక రిలేట్ అవ్వగలుగుతారా? అనేవి ఒక దర్శకుడు స్క్రిప్ట్ రాసుకునేప్పుడే ఆలోచించుకోవాల్సిన విషయాలు. శ్రీకాంత్ ఓదెల ఈ విషయాలేవీ సీరియస్ గా తీసుకోకుండా, కనీసం క్లైమాక్స్ కూడా సరిగా రాసుకోకుండా తెరకెక్కించిన చిత్రం “ప్యారడైజ్”. ఒక జాతి తమ గుర్తింపు కోసం చేసే పోరాటంలో మదర్ సెంటిమెంట్ అనేది అల్టీమేట్ ఎలివేషన్, అలాంటి ఎలివేషన్ ను నీరుగార్చిన శ్రీకాంత్.. ఇక అందులో ఏమాత్రం సెన్స్ లేని సన్నివేశాలను కుప్పలుతప్పలుగా జోడించి ఇంకాస్త బోర్ కొట్టించాడు. ఫస్టాఫ్ కే ఓపిక అయిపోయింది అనుకునేలోపు.. సెకండాఫ్ లో ఉన్న సహనాన్ని కూడా పూర్తిస్థాయిలో పరీక్షించి థియేటర్ల నుండి ప్రేక్షకులు పరుగులు పెట్టేలా చేశాడు. ముఖ్యంగా కేసీఆర్, ఎన్టీఆర్ లాంటి పొలిటీషన్ పాత్రలు సినిమాలో ఇరికించాల్సిన అవసరం లేకుండా బలవంతంగా జొప్పించి.. ఉన్న ట్రోల్ కంటెంట్ సరిపోదన్నట్లు.. పొలిటికల్ పార్టీలు కొట్టుకుని తిట్టుకునే బోలెడంత హేట్రెడ్ కంటెంట్ కూడా ఇచ్చాడు. ఈ సినిమా శ్రీకాంత్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు.. నిర్మాత డబ్బుల్ని, హీరో నమ్మకాన్ని, హీరోయిన్ గౌరవాన్ని పణంగా పెట్టి ఆడిన జూదం. ఈ జూదంలో శ్రీకాంత్ కోల్పోయింది విజయాన్ని మాత్రమే కాదు, “దసరా” సినిమాతో దర్శకుడిగా/టెక్నీషియన్ గా అతడు సంపాదించుకున్న మర్యాదని కూడా.
ఓవరాల్ గా.. పాచిపోయిన ప్యారడైజ్ బిర్యానీ!
M9 రేటింగ్: 1.75/5





