టిడిపి ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనితకు మంగళవారం ఓ వైసీపీ కార్యకర్త నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఏపీలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలపై ఈరోజు విజయవాడలో మహిళా మండలి సంఘాలు సమావేశం అయ్యాయి. ఆ సమావేశంలో ఉన్నప్పుడే వంగలపూడి అనితకు వైసీపీ కార్యకర్త నుంచి బెదిరింపు కాల్ రావడంతో ఆమె ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అక్కడే ఉన్న మీడియా ముందే అతనితో మాట్లాడారు.
ఇంతకీ అవతలి వ్యక్తి ఏమన్నాడంటే, “మీరు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కాస్త తగ్గించుకొంటే మంచిది. లేకుంటే మీ పార్టీ నేతలు నారా లోకేష్, బోండా ఉమా తదితరుల వీడియోలను కూడా బయటపెడతాము,” అంటూ బెదిరింపులకు దిగాడు.
వంగలపూడి అనిత కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా, “ఏమి ఎందుకు మాట్లాడకూడదు? మీ ఎంపీ తప్పు చేస్తే నిలదీయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? లోకేష్ బాబు, బోండా ఉమా ఏం చేశారు? నన్ను బెదిరించడం దేనికి? దమ్ముంటే నీ దగ్గరున్న ఆ వీడియోలు బయటపెట్టు. ఇంతకీ మీ ఎంపీ చేసింది తప్పే అని నువ్వు అనుకొంటున్నావా లేదా? తప్పనుకొంటే ఇంతవరకు అతనిమీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? తప్పుచేయలేదనుకొంటే అదే మాట మీ పార్టీ చేత చెప్పించు చూద్దాం,” అంటూ కడిగిపడేయడంతో అతను ‘మీకో దణ్ణం…’ అంటూ ఫోన్ పెట్టేశాడు.
అనంతరం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకొంటే, వైసీపీలో ఇంకెంతమంది నేతల భాగోతాలు బయటపడతాయో… అలా అందరిపై చర్యలు తీసుకోవడం మొదలుపెడితే పార్టీ ఖాళీ అయిపోతుందనే భయంతోనే సిఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం అతని వికృత చేష్టలను ఖండించలేదు. అతనిపై చర్యలు తీసుకోమని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఇప్పుడు మాపైనే బెదిరింపులకు పాల్పడుతోంది,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు @Anitha_TDP మీడియా సమావేశంలో ఉండగా, గోరంట్ల మాధవ్ విషయంలో స్పందించ వద్దంటూ 9848075369 నెంబర్ నుంచి ఫోన్ చేసిన ఒక వైసీపీ నేత ఆమెను బెదిరించాడు. ఒక మహిళా నేతను ఇలా బెదిరించారంటే… మాధవ్ విషయాన్ని వైసీపీ పెద్దలు ఏ రేంజ్ లో నొక్కిపెడుతున్నారో అర్థం అవుతుంది pic.twitter.com/a6P22OHbyf
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2022



