ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్ళుగా మాయాబజార్ సినిమాలోలాగ అనేక విచిత్రాలు జరుగుతున్నాయి. కళ్ళ ఎదురుగా ఉన్న అమరావతి వైసీపీ నేతలెవరికీ కనిపించదు. కానీ అదే అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయం, శాసనసభలో సిఎం జగన్, మంత్రులు కూర్చొని పాలన సాగిస్తుంటారు.
అయితే వారి అదృష్టం ఏమిటంటే మాయబజార్ సినిమాలోలాగా అక్కడ తలపం, గిలపం, కంబళి, గింబళి వంటివి లేవు. ఉండి ఉంటే వారక్కడ ఇన్నేళ్ళు కూర్చొని ఉండేవారే కాదు కదా?
అమరావతిలో కట్టిన భవనాలు వారికి కనబడలేదనుకొంటే దానికో కారణం చెప్పుకొంటున్నారు కనుక అర్దం చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి హయాంలో కట్టిన లక్షల టిడ్కో ఇళ్ళు కూడా వైసీపీ నేతలకు కనిపించలేదు. కనుక ఎవరూ వాటి వంక చూడకుండా పేదలకు సెంటుభూమి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే వాటిని కూడా టిడిపి హయాంలో చంద్రబాబు నాయుడే కట్టించారు కనుక!
వైసీపీ నేతలకు కళ్లెదుట ఉన్న ఆ ఇళ్ళు కనిపించనప్పటికీ లబ్ధిదారులకు మాత్రం చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి కనుక వాటిలో పెండింగ్ పనులు పూర్తిచేసి ఇవ్వాలని నాలుగేళ్ళుగా మొత్తుకొంటూనే ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
అయితే ఈ ‘సెంటు భూమి’ పంపిణీ కంటే టిడిపి హయాంలో కట్టించిన ఇళ్లకు వైసీపీ రంగులేసి పంచిపెట్టడమే సులువు… ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని ఏ సలహాదారైనా చెప్పారో ఏమో కానీ వైసీపీ ప్రభుత్వం హడావుడిగా వాటికి రంగులు వేసే కార్యక్రమం మొదలుపెట్టింది.
కొత్తగా ఇళ్ళు కట్టడం కష్టమేమో గానీ రంగులు వేయడంలో నాలుగేళ్ళ అనుభవం ఉన్న వైసీపీ ప్రభుత్వం చకచకా వైసీపీ రంగులు వేసేస్తుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి, చకచకా వాటిని పంచిపెట్టేస్తున్నారు.
ఇంతకాలం కళ్లెదుటే లక్షల ఇళ్ళు ఉన్నా కనబడకపోవడం, మళ్ళీ హటాత్తుగా వైసీపీ రంగులతో ప్రత్యక్షమవడం మాయాబజార్ సినిమాను గుర్తుచేస్తున్నాయి. అసలు ఉన్నవి లేన్నట్లు, చేయనివి, చేయలేనివి (మూడు రాజధానులు, పోలవరం ప్రాజెక్టు) చేసేస్తున్నట్లు వైసీపీ నేతలు చెప్పుకోవడం కూడా మాయబజార్ సినిమాను గుర్తుచేస్తున్నాయి.
మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిద్యం వహిస్తున్న గుడివాడలో కూడా టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళకు వైసీపీ రంగులు వేసి వాటిని సిఎం జగన్మోహన్ రెడ్డి లబ్దిదారులకు అందజేస్తూ, “చంద్రబాబు నాయుడు ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క పని పూర్తి చేశారా?”అని ప్రశ్నించడం చూసి ప్రజలు ముసిముసినవ్వులు నవ్వుకొన్నారు.
వైసీపీ రంగులు వేసుకొన్నాకనే టిడ్కోఇళ్ళను వైసీపీ నేతలు చూడగలుగుతున్నారు అంటే బహుశః వారికి కలర్ బ్లైండ్ నెస్ ఉందేమో?అనుకోవడానికి లేదు కనుక దీనిలో ఒక నీతిని గమనించాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అది అన్నిటికీ తమ పార్టీ రంగులు వేసేసుకొంటూ ఉండాలి. రంగులు వేయకపోతే అవన్నీ వేరేవారి పద్దులో వ్రాసుకోబడతాయి. ఇందుకు టిడ్కో ఇళ్ళే సాక్ష్యం.
ఈ విషయం తెలియకనే పాపం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇళ్ళు కట్టించేశారు కానీ వాటికి టిడిపి రంగులు వేసుకోవాలనే ఆలోచన చేయలేదు. అయితే ప్రతీ బియ్యం గింజమీద తినేవాడి పేరు వ్రాసుంటుందన్నట్లు, చేసిన ప్రతీ పనికీ వెంటనే ఓ ముద్ర వేసుకోవడం టిడిపి కూడా నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇంత అమాయకంగా ఉండబట్టే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఏమి చేశారని నేడు ఏమీ చేయని వైసీపీ నేతలు కూడా ప్రశ్నించగలుగుతున్నారు కదా?.



