Tirumala Laddu Jagan-Konda Surekha Nagarjuna

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంచుమించు ఒకే సమయంలో రెండు వివాదాలు యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో ఏపీ, అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రాజకీయ ప్రకంపనలు దేశమంతటా వ్యాపించాయి.

అయితే కల్తీ నెయ్యి వ్యవహారంతో ఏపీలో తొలిసారిగా మత రాజకీయాలపై వాదోపవాదాలు జరిగాయి. ఆ క్షీరసాగర మదనంలో నుంచి వరుసగా తిరుమల డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మం, ఎరుపు రంగు దుస్తులలో పవన్‌ కళ్యాణ్‌, తాజాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తున్న సిట్‌ ఆవిర్భవించాయి.

Also Read – అన్న అలా…చెల్లి ఇలా..!

ఒకవేళ వైసీపి తిరుమల అంశంపై సుప్రీంకోర్టుకి వెళ్ళకపోయి ఉంటే, లోకల్ రాజకీయ కక్షల పేరుతో రోటీన్ రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ వెళ్ళి సిట్‌ని తెచ్చుకుంది.

అది కల్తీ నెయ్యి వాసన పసిగట్టినా, పసిగట్టలేకపోయినా అంతవరకు టిడిపి-వైసీపిల మద్య టామ్ అండ్ జెర్రీ షో నడుస్తూనే ఉంటుంది. ఈలోగా పవన్‌ కళ్యాణ్‌ సనాతనధర్మ మార్గంలో ఎటువైపు నడుస్తారనేది చాలా ఆసక్తికరంగానే ఉంది.

Also Read – జగన్‌ హెచ్చరికలను లైట్ తీసుకుంటే…. ఫినిష్!

ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌ మీద బాణం గురిపెడితే కొడితే అది అక్కినేని కుటుంబానికి గుచ్చుకుంది. దాంతో అటునుంచి అక్కినేని అండ్ సన్స్ వంద కోట్లు ఖరీదైన పరువు నష్టం బాణాన్ని ఆమెపై సందించారు.

ఈ యుద్ధంలో అసలైన క్షతగాత్రురాలు సమంత కాగా ఆమె సైడ్ అయిపోగానే టాలీవుడ్‌ హీరోలందరికీ పూనకం వచ్చేసిన్నట్లు రంగంలో దిగిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Also Read – సెలబ్రేటీలు పిలిచినా రారు!… అవును ఎందుకు రావాలి?

అంటే వారందరూ అన్యాయాన్ని ఎదిరిస్తున్నారా?సమంత కోసం పోరాడుతున్నారా? ఎన్‌ కవెన్షన్ కూల్చేసినప్పుడు మాట్లాడలేదు కనుక దానికి బదులుగా ఇప్పుడు అక్కినేని నాగార్జునకి మద్దతు తెలుపుతున్నారా?లేదా రేవంత్‌ రెడ్డి కంటే కేసీఆరే బెటర్ అనుకుంటున్నారా? రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ లాంటి నిరంకుశవాది కాదనే ధైర్యంతోనా?అసలు వారి వీరావేశం వెనుక కారణం ఏమిటి?అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

వారి వీరావేశాన్ని చూసిన మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొంటున్నానని చెప్పిన మర్నాడే మళ్ళీ ఆమె మీడియా ముందుకు వచ్చి ‘నాగ చైతన్య-సమంతలు ఎందుకు విడాకులు తీసుకున్నారో చెప్పాలని’ డిమాండ్ చేశారు.

అంటే అక్కినేని ఆవేశం, టాలీవుడ్‌ వీరావేశం ఎక్కువ కాలం నిలబడదని, నిలబడితే ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకోలేరనే జ్ఞానోదయం ఆమెకు కలిగి ఉండవచ్చు. లేకుంటే ఆమె మళ్ళీ మాట్లాడేవారు కారు.

బహుశః ఈ జ్ఞానోదయం టాలీవుడ్‌కి కలిగే ఉంటుంది. ఒకవేళ కలగకపోయి ఉంటే కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో అక్కినేని నాగార్జునపై చేసిన ఫిర్యాదు యాక్టివ్‌ అవుతుంది. అలాగే డ్రగ్స్ కేసులు, క్యాస్టింగ్ కౌచ్ కేసులు, బ్లాక్ అండ్ వైట్ లావాదేవీలు, రెమ్యూనరేషన్స్, సినిమా టికెట్‌ ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు వంటివి చాలానే ఉన్నాయి. కనుక ఇక నుంచి నాగార్జున వెనుక టాలీవుడ్‌లో ఎంతమంది నిలబడతారో చూడాల్సిందే.

ఈ వివాదాలతో ఏపీలో మత రాజకీయాలు కొత్తగా పుట్టుకువస్తే, తెలంగాణ రాజకీయాలలో తొలిసారిగా టాలీవుడ్‌ హైలైట్ అవుతోందిప్పుడు. మత రాజకీయాలు, టాలీవుడ్‌ రెండూ స్పైసీగానే ఉంటాయి. కానీ వాటిని జీర్ణించుకోవడమే చాలా కష్టం!