తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమక్షంలో తెలుగు చలన చిత్ర ప్రముఖుల కీలక మీటింగ్ కాసేపటి క్రితం జరిగింది. షూటింగులు ఆగిపోవడం వల్ల దాదాపుగా 14,000 కార్మికులు రోడ్డున పడ్డారని, డబ్బుల రొటేషన్ ఆగిపోయి నిర్మాతలు దివాళా తీసే పరిస్థితి ఉందని వారంతా మంత్రి దృష్టికి తెచ్చారు.
లాక్‌డౌన్ ముగుస్తున్న సందర్భంలో ఆయా రంగాలకు ప్రభుత్వం షరతులతో కూడిన సడలింపులు ఇస్తోంది. ఇలాంటి తరుణంలో సినీ రంగానికి మాత్రం ఎటువంటి వెసులుబాటు ఇవ్వలేదని వారు నిరాశ వ్యక్తం చేశారు. దీనితో రేపటి నుండి నిర్మాణానంతర కార్యక్రమాలకు ప్రభుత్వం రేపటి నుండి అనుమతిని ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
అయితే షూటింగుల విషయంలో మాత్రం మంత్రి సరైన హామీ ఇవ్వలేదు. షూటింగుల సమయంలో తీసుకునే జాగ్రత్తలు సినీ ప్రముఖులు మంత్రికి వివరించారు. వాటితో ఒక శాంపిల్ షూటింగ్ వీడియో చేసి త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తారు. దానిని చుసిన తరువాత షూటింగ్లు అనుమతించడంపై ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం.
ఇప్పటివరకు వివిధ దశలలో ఉన్న సినిమాలు, వాటికి అవసరమైన లొకేషన్ల వివరాలు కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో మాత్రం సానుకూల స్పందన రాలేదని సమాచారం. ఇదే విషయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా సినీ ప్రముఖులు చర్చించనున్నారు.



