తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ నిర్మాతలకు, సినీ కార్మికులకు మద్య జీతాల పెంపు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. హైదరాబాద్ మహా నగరంలో కనీస వేతనాలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా కష్టంగా ఉందని కనుక 30 శాతం జీతాలు పెంచాలని సినీ కార్మికులు కోరుతున్నారు.
కానీ దేశంలో ఇతర సినీ పరిశ్రమలతో పోలిస్తే తాము ఇప్పటికే చాలా ఎక్కువ చెల్లిస్తున్నామని, ఇంకా జీతాలు పెంచమంటే తమ వల్లకాదని నిర్మాతల మండలి స్పష్టం చేసింది.
కనుక టాలీవుడ్‌లో నాలుగు రోజులుగా సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వారు సమ్మె చేస్తుంటే, నిర్మాతల మండలి కూడా కటువుగానే వ్యవహరిస్తోంది. నిర్మాతలందరూ తక్షణం సినిమా షూటింగులు అన్నీ నిలిపివేయాలని, సినీ కార్మిక సంఘం నేతలతో ఎవరూ ఎటువంటి చర్చలు జరుపరాదని ఆదేశించింది.
ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం కొరకు ప్రయత్నిస్తున్నామని, అంత వరకు నిర్మాతలందరూ ఓపిక పట్టాలని నిర్మాతల మండలి సూచించింది.
ఇరువర్గాలు బిగుసుకు కూర్చున్నాయి కనుక టాలీవుడ్‌లో సమ్మె కొనసాగుతోంది. షూటింగులు నిలిచిపోయాయి. దీని వలన భారీగా పెట్టుబడి సినిమాలు తీస్తున్న నిర్మాతలు నష్టపోతున్నారు. మరోపక్క షూటింగులు నిలిచిపోవడం వలన సినీ కార్మికులు నష్టపోతున్నారు. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారే తప్ప ఇరు వర్గాలు వెనక్కి తగ్గడం లేదు.
మూడేళ్ళ క్రితం ఆగస్ట్ నెలలోనే ఇలాగే సమ్మె జరిగింది. అప్పుడూ సమస్యలకు శాశ్విత పరిష్కారం కోసం అంటూ నిర్మాతల మండలి నెలరోజుల పాటు షూటింగులు నిలిపివేసింది. కానీ సమస్యలకు శాశ్విత పరిష్కారం లభించలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నేటికీ కొనసాగుతున్న సమ్మె… ఆయన ప్రయత్నాలు ఫలించలేదని స్పష్టం చేస్తోంది.
దీని కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ నేడు మరోసారి ఇరువర్గాలతో సమావేశమయ్యి చర్చిస్తోంది. ఒకవేళ దాని వల్లా కాకపోతే మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు చొరవ తీసుకొని మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్దమని చెపుతున్నారు.
ఇప్పటికే కొందరు నిర్మాతలు వారిని కలిశారు కూడా. కనుక టాలీవుడ్‌లో ఏర్పడిన ఈ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం చాలా అవసరం. లేకుంటే అందరూ నష్టపోతారు.




