త్రివిక్రమ్… నాని కాంబినేషనలో ఒక సినిమా రూపొందనుందనే టాక్ రెండు రోజులుగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ వార్త నిజమా కాదా అనే సందేహం చాలామందిలో తలెత్తింది. అయితే ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయమనీ… ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.
యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను నానికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. వరుస హిట్లతో ఆయన ప్రయాణం కొనసాగుతోంది. ఆయనతో ఒక సినిమా చేసిపెట్టమని త్రివిక్రమ్ ను డీవీవీ దానయ్య ఒత్తిడి చేస్తున్నారట. ఆ విధంగా చేయడానికి త్రివిక్రమ్ కూడా సుముఖంగానే వున్నాడని టాక్!
ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లలో వున్నాడు. ఆ తరువాత ఆయన మహేశ్ బాబు, వెంకటేశ్ లతో సినిమాలు చేయనున్నాడు. అయితే డీవీవీ దానయ్య కోరిక మేరకు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే, నానితో కల్సి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్… నాని కాంబినేషన్ పట్ల అందరిలోను ఆసక్తి నెలకొంది.



