ట్రంప్‌ నిలబడమంటే నిలబడి… కూర్చోమంటే కూర్చుంటే…

Trump Modi controversy

భారత్‌-పాక్‌ కంటే ముందుగా వాటి మద్య జరుగుతున్న యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ప్రకటింఛి మోడీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయదని ప్రకటించి ఇంకా ఇబ్బంది పెడుతున్నారు.

రష్యా నుంచి భారత్‌ ఇకపై చమురు కొనుగోలు చేయదని ప్రధాని మోడీ తనకు మాట ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. దీనిని భారత్‌ విదేశాంగ ఖండించలేదు కానీ అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

ADVERTISEMENT

నవంబర్‌ 11,14 తేదీల బీజేపికి చాలా కీలకమైన బీహార్‌ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్‌ 10 సార్లు ముఖ్యమంత్రిగా ఉండటంతో బీహార్‌ ప్రజలకు మొహం మొత్తేసింది.

ఆయన (జేడీయు)తో బీజేపి పొత్తులు పెట్టుకున్న పాపానికి శాసనసభ ఎన్నికలలో గెలుపు కోసం బీజేపి ఎదురీదవలసి వస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ట్రంప్‌ చేసిన తాజా ప్రకటన కాంగ్రెస్‌ పార్టీకి లాభం, బీజేపికి నష్టం కలిగించవచ్చు.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ట్రంప్‌ మాటలను పట్టుకొని అల్లుకుపోతోంది. ప్రధాని మోడీ ట్రంప్‌ని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయాలో వద్దో ట్రంపే నిర్నయిస్తున్నారని, పైగా ఆయన అభినందన సందేశాలు కూడా పెడుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ భయంతోనే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన కూడా రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ అంటూ గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోడీ ఇప్పుడు ట్రంప్‌ని చూసి గజగజా వణికిపోతున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆపరేషన్ సింధూర్ గురించి గొప్పగా చెప్పుకొని బీజేపి ఓటర్ల మనసులు గెలుచుకోవాలని తాపత్రయపడుతుంటే, ఎక్కడో అమెరికాలో ఉన్న ట్రంప్‌ ఇలాంటి మాటలు మాట్లాడుతూ బీజేపికి నష్టం కలిగిస్తున్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్‌ భారీగా సుంకాలు విధించినా ‘తగ్గేదేలే…’ అని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఇప్పుడు ట్రంప్‌ మాటలను గట్టిగా ఖండించలేకపోతోంది.

రష్యా చమురు కొనుగోలు చేయాలో వద్దో భారత్‌ నిర్ణయించుకోవాలి. కానీ ట్రంపే నిర్ణయిస్తున్నారని రాహుల్ గాంధీ వాదన సహేతుకంగానే ఉంది. ఒకవేళ భారత్‌ కూడా అమెరికాకు ఇలాంటి ఆంక్షలు పెడితే పాటిస్తుందా? అంటే కాదనే అందరికీ తెలుసు.

కానీ ట్రంప్‌ నిలబడమంటే నిలబడుతూ, కూర్చోమంటే కూర్చుంటే ఇక భారత్‌కు విలువ ఏముంటుంది? రేపు పాలనలో, విధాన పరమైన నిర్ణయాలలో, తర్వాత ఎన్నికలలో కూడా ట్రంప్‌ జోక్యం చేసుకుంటే అప్పుడు భారత్‌ ఏం చేస్తుంది?

ADVERTISEMENT
Latest Stories